ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక పెట్టుబడులను పెద్దఎత్తున ఆకర్షించేందుకు పూర్తి పారదర్శకమైన రాయితీల విధానాన్ని అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. పరిశ్రమలకు అందించే ప్రభుత్వ రాయితీల చెల్లింపుల కోసం ప్రత్యేకంగా ‘ఎస్క్రో అకౌంట్’ విధానాన్ని తీసుకొచ్చామని, రాష్ట్రంలో ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’కు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని ఆయన తెలిపారు. విశాఖపట్నంలో పర్యటించిన జపాన్ రాయబారి కెయిచీ ఓనో నేతృత్వంలోని బృందంతో ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో పారిశ్రామిక పెట్టుబడులు, నైపుణ్యాభివృద్ధి, కీలక ఖనిజాల సరఫరా, ఉక్కు పరిశ్రమ, గ్రీన్ ఎనర్జీ వంటి పలు కీలక రంగాలపై సుదీర్ఘంగా చర్చించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో అపారమైన యువశక్తి అందుబాటులో ఉందని, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా వారికి నైపుణ్య శిక్షణ అందిస్తే అత్యుత్తమ మానవ వనరులుగా మారతారని పేర్కొన్నారు. రాష్ట్రంలో స్కిల్ డెవలప్‌మెంట్‌కు తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, ఈ ప్రక్రియలో జపాన్ సంస్థలు భాగస్వామ్యం కావాలని కోరారు. ఇందుకు జపాన్ ప్రతినిధులు సానుకూలంగా స్పందిస్తూ, ప్రస్తుతం రాష్ట్రంలోని పరిశ్రమల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు.

కీలక ఖనిజాలైన ‘రేర్ ఎర్త్ మినరల్స్’ను జపాన్‌కు నిరంతరాయంగా సరఫరా చేసే అంశంపైనా ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగింది. ఈ సహకారం భారత్-జపాన్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని జపాన్ రాయబార బృందం అభిప్రాయపడింది. అలాగే ఆర్సెలార్ మిట్టల్-నిప్పన్ స్టీల్ ఇండియా ఉక్కు ప్లాంట్‌కు సంబంధించి, తుది దశ ప్రాసెసింగ్ కోసం అవసరమైన సెమీ ఫినిష్డ్ ఉత్పత్తులను జపాన్‌లోని మాతృసంస్థ నుంచి దిగుమతి చేసుకునే ప్రక్రియకు ప్రభుత్వం తగిన తోడ్పాటు అందించాలని కోరారు. 

మరోవైపు విద్యుత్ పంపిణీలో అధిక సామర్థ్యం కలిగిన ట్రాన్స్‌ఫార్మర్ల తయారీకి ఉపయోగించే ‘అమార్ఫస్ మెటల్’ను దేశంలోనే తొలిసారిగా ఉత్పత్తి చేయాలని ప్రొటీరియల్ ఇండియా నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పారిశ్రామిక ప్రోత్సాహకాల సహకారంతో 2026 డిసెంబరు నాటికి శ్రీసిటీలో ఈ యూనిట్ ఉత్పత్తి ప్రారంభించేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ప్రతినిధులు వివరించారు.

భారతీయ నిపుణుల ప్రతిభను అంతర్జాతీయ అవసరాలకు వినియోగించుకునే దిశగా విశాఖపట్నంలో భారత్-జపాన్ సహకారంతో కొత్తగా ‘గ్లోబల్ కేపబిలిటీ సెంటర్’ (జీసీసీ) ఏర్పాటు చేసినట్లు జపాన్ ప్రతినిధులు తెలిపారు. దీనితో పాటు హరిత ఇంధన రంగంలో కీలక ముందడుగు పడింది. కాకినాడ నుంచి ఏటా సుమారు 70 వేల టన్నుల గ్రీన్ అమ్మోనియాను ఐదేళ్ల పాటు కొనుగోలు చేసేందుకు జపాన్‌కు చెందిన ప్రముఖ విద్యుత్ దిగ్గజం ‘జెరా’, ఏపీకి చెందిన ‘ఏఎం గ్రీన్’ సంస్థతో ప్రాథమిక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ పరిణామం రెండు దేశాల మధ్య పటిష్టమైన గ్రీన్ అమ్మోనియా సరఫరా వ్యవస్థ నిర్మాణానికి బలమైన పునాదిగా నిలుస్తుందని ఇరు వర్గాలు ధీమా వ్యక్తం చేశాయి.