మాజీ ప్రధాని పీవీ నరసింహారావు మరణించినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆయనకు తగిన గౌరవం ఇవ్వలేదన్న ఆరోపణల్లో కొంత నిజం ఉందని సీనియర్ కాంగ్రెస్ నేత పృథ్వీరాజ్ చవాన్ అన్నారు. సోనియా గాంధీ ఆత్మకథ ‘బిలాంగింగ్‌: ఎ జర్నీ ఆఫ్ లవ్‌’ చుట్టూ సాగుతున్న చర్చ నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

నరసింహారావు కాంగ్రెస్ అధ్యక్షుడిగా, ప్రధానిగా పనిచేసినప్పటికీ మరణించినప్పుడు పార్టీ తరఫున తగిన గౌరవం దక్కలేదన్నది ఆరోపణ అని చవాన్ పేర్కొన్నారు. ఆయనకు కాంగ్రెస్ పార్టీ లాంఛనాలతో గౌరవం కల్పించి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. అయితే, హిందూ-ముస్లిం సంబంధాలు, బాబ్రీ మసీదు కూల్చివేత విషయంలో నరసింహారావుపై ఆరోపణలు ఉన్నాయని పేర్కొన్నారు. వాటిలో నిజమెంతో తెలియనప్పటికీ.. ఆరోపణలు వచ్చిన మాట మాత్రం వాస్తవం అన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు గౌరవం ఇవ్వడం దేశంలోని కొన్ని వర్గాలను ఇబ్బంది పెట్టవచ్చని సోనియా భావించి ఉండొచ్చని అన్నారు. ఇది తన అంచనా మాత్రమేనని, వాస్తవంగా ఏం జరిగిందో తనకు తెలియదని స్పష్టం చేశారు. ఈ అంశాన్ని సోనియా తన పుస్తకంలో ప్రస్తావించారో? లేదో? కూడా తనకు తెలియదని చెప్పారు.

మరోవైపు, పీవీ మనవడు, తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి ఎన్‌వీ సుభాష్‌ సోనియా పుస్తకంపై విమర్శలు చేశారు. చరిత్రకు సంబంధించిన తప్పులతో నిండిన ఈ పుస్తకం అబద్ధాల పుట్ట అని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి, దేశానికి పీవీ చేసిన సేవలను కావాలనే విస్మరించారని అన్నారు. గాంధీ కుటుంబేతర నాయకులను పక్కనపెట్టి, తమ కుటుంబ సభ్యులకు ప్రాధాన్యం ఇవ్వడం ఆ కుటుంబానికి అలవాటుగా మారిందని విమర్శించారు.

రాజీవ్‌ గాంధీ రాజకీయాల్లోకి రావడం తనకు ఇష్టం లేదని సోనియా చెప్పడాన్ని, మరోవైపు తన పిల్లలను రాజకీయాల్లోకి ప్రోత్సహించడాన్ని సుభాష్‌ తప్పుబట్టారు. బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనపై సోనియా స్పందనను కూడా విమర్శించారు. నవంబర్‌ 10న విడుదలైన సోనియా ఆత్మకథపై రాజకీయంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.