బాలీవుడ్ ప్రముఖ నటి కరీనా కపూర్ ఖాన్ దీపావళి సందర్భంగా ధరించిన ఓ పురాతన లాకెట్ ప్రస్తుతం తీవ్ర వివాదానికి దారితీసింది. పవిత్ర ఖురాన్‌లోని ‘ఆయత్-ఉల్-కుర్సీ’ వాక్యాలు చెక్కబడిన 30 క్యారెట్ల పచ్చల (ఎమరాల్డ్) లాకెట్‌ను ధరించడంపై ఆమెకు లీగల్ నోటీసు అందింది. అయితే, ఈ వ్యవహారంలో ఒక హిందూ సంస్థ కరీనాకు పూర్తి మద్దతుగా నిలవడం విశేషం.

దీపావళి వేడుకల కోసం కరీనా కపూర్ డిజైనర్ పునీత్ బలానా రూపొందించిన కాఫ్తాన్, తలపాగా ధరించారు. ఈ లుక్‌లో భాగంగా ఆమె భోపాల్ రాజకుటుంబానికి చెందిన వారసత్వ ఆభరణాలను ధరించినట్లు ప్రముఖ సెలబ్రిటీ స్టైలిస్ట్ రియా కపూర్ ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించారు. భోపాల్ బేగంకు చెందిన 30 క్యారెట్ల పచ్చల లాకెట్‌తో పాటు దాదాపు 200 ఏళ్ల నాటి కల్గీని ఆమె ధరించారు. ఈ ఆభరణాలు సైఫ్ అలీ ఖాన్ కుటుంబ వారసత్వంగా వచ్చినవి. సైఫ్ అలీ ఖాన్ నాయనమ్మ సాజిదా సుల్తాన్.. భోపాల్ చివరి నవాబు హమీదుల్లా ఖాన్ కుమార్తె. ఈ పవిత్ర లాకెట్‌పై ఖురాన్‌లోని రెండవ అధ్యాయం (సూరా అల్-బఖరా)లోని 255వ వచనమైన ‘ఆయత్-ఉల్-కుర్సీ’ చెక్కి ఉంది.

ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి అబ్బాస్ హఫీజ్ తన న్యాయవాది మహమ్మద్ జాఫర్ ద్వారా నవంబర్ 11న కరీనా కపూర్, రియా కపూర్‌లకు లీగల్ నోటీసు పంపించారు. సోషల్ మీడియా నుంచి సంబంధిత పోస్టులను వెంటనే తొలగించాలని, బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆ నోటీసులో డిమాండ్ చేశారు. ఇది తన వ్యక్తిగత నిర్ణయమని, కాంగ్రెస్ పార్టీ వైఖరి కాదని హఫీజ్ స్పష్టం చేశారు. ఎవరైనా తమకు నచ్చిన దుస్తులు ధరించడంపై తమకు అభ్యంతరం లేదని, కానీ ఇస్లామిక్ సంస్కృతికి చెందిన అత్యంత పవిత్రమైన చారిత్రక ఆభరణాన్ని ఫ్యాషన్ వేదికలపై ప్రదర్శించడం ముస్లింల మనోభావాలను దెబ్బతీసిందని ఆయన పేర్కొన్నారు.

మరోవైపు, ఈ వివాదంపై హిందూ ఉత్సవ సమితి అధ్యక్షుడు చంద్రశేఖర్ తివారి తీవ్రంగా స్పందిస్తూ కరీనా కపూర్‌కు బాసటగా నిలిచారు. లాకెట్ అనేది మెడలో, హృదయానికి దగ్గరగా ఎంతో పవిత్రమైన స్థానంలో ధరించేదని, అందులో ఎలాంటి అగౌరవం లేదని ఆయన అన్నారు. కరీనా కపూర్ ఎవరికీ క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు. భోపాల్ రాజకుటుంబానికి కోడలిగా వచ్చిన కరీనాకు ఆ వారసత్వ ఆభరణాలను ధరించే హక్కు ఉందని, ఆమెకు సంస్కృతి బచావో మంచ్, హిందూ ఉత్సవ సమితి అండగా ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.