జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా, స్వతంత్ర భారత తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘనంగా నివాళులర్పించారు. ఆజాద్ జయంతిని పురస్కరించుకుని బుధవారం 'ఎక్స్' వేదికగా ఆయన దేశానికి చేసిన సేవలను స్మరించుకుంటూ ముఖ్యమంత్రి ఒక సందేశాన్ని పోస్ట్ చేశారు.

స్వాతంత్య్ర సమరయోధుడిగా, గొప్ప విద్యావేత్తగా దేశ విద్యా వ్యవస్థకు ఆజాద్ బలమైన పునాదులు వేశారని చంద్రబాబు కొనియాడారు. "స్వాతంత్య్ర సమరయోధుడు, మహోన్నత పండితుడు, దేశ విద్యావ్యవస్థ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేసిన భారత తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలు చిరస్మరణీయమైనవి. ఆయన జీవితం, ఆదర్శాలు భవిష్యత్తు తరాలకు నిరంతరం స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. ఈ మహనీయుని జయంతి సందర్భంగా నేను ఘన నివాళులర్పిస్తున్నాను" అని చంద్రబాబు తన సందేశంలో పేర్కొన్నారు.

భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత 1947 నుంచి 1958 వరకు మౌలానా ఆజాద్ తొలి విద్యాశాఖ మంత్రిగా విశేష సేవలు అందించారు. ఆయన హయాంలోనే ఐఐటీ, యూజీసీ వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు ఏర్పాటయ్యాయి. ఆయన జయంతి రోజైన నవంబర్ 11ను 2008వ సంవత్సరం నుండి కేంద్ర ప్రభుత్వం ఏటా జాతీయ విద్యా దినోత్సవంగా నిర్వహిస్తోంది.