విశాఖపట్నంలో రేపు ప్రతిష్ఠాత్మక సీఐఐ భాగస్వామ్య సదస్సు (CII Partnership Summit) ప్రారంభం కానున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఒకరోజు ముందుగానే నగరానికి చేరుకున్నారు. ఆయనకు టీడీపీ నేతలు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రి ఉన్నత స్థాయి ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలు, మౌలిక వసతుల కల్పన, ద్వైపాక్షిక వాణిజ్య విస్తరణకు సంబంధించిన కీలక అంశాలపై సమగ్రంగా చర్చించారు.

ముఖ్యంగా ఫుడ్ ప్రాసెసింగ్, వ్యవసాయ ఆధారిత రంగాల్లో ఏపీలో భారీగా పెట్టుబడులు పెట్టాలని సీఎం చంద్రబాబు యూఏఈ కంపెనీలను ఆహ్వానించారు. 'సిలాల్' వంటి ప్రముఖ సంస్థలతో పాటు యూఏఈ ఫుడ్ క్లస్టర్ ప్రతినిధులు ఏపీలో పెట్టుబడులకు ముందుకు రావాలని కోరారు. రాయలసీమ ప్రాంతం అంతర్జాతీయ స్థాయి హార్టికల్చర్ హబ్‌గా రూపుదిద్దుకుంటోందని, అక్కడ అపారమైన అవకాశాలు ఉన్నాయని వివరించారు. రాష్ట్రంలో ఫుడ్ క్లస్టర్ ఏర్పాటు ప్రక్రియపై సత్వరమే నిర్ణయం తీసుకోవాలని సీఎం కోరగా, ఇప్పటికే దాదాపు 12 యూఏఈ ఆధారిత కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు చురుగ్గా ఆసక్తి చూపుతున్నట్లు చర్చల్లో వెల్లడైంది.

భారత తూర్పు తీర ప్రాంతంలో విస్తరించి ఉన్న సముద్ర ముఖద్వారాలు, నౌకాశ్రయాల ఆధారిత అభివృద్ధిలో ఏపీతో కలిసి పనిచేయడంపై ఇరు పక్షాలు దృష్టి సారించాయి. అలాగే ఏరోస్పేస్, రక్షణ రంగాల్లో ఉన్న పరస్పర సహకార అవకాశాలపై కూడా చర్చలు జరిగాయి. పారిశ్రామిక వేగవంతమైన పురోగతికి ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సీఎం ఈ సందర్భంగా వివరించారు.

ఆంధ్రప్రదేశ్‌లో మౌలిక వసతుల రంగం శరవేగంగా పురోగమిస్తుండటంపై యూఏఈ ప్రతినిధి బృందం హర్షం వ్యక్తం చేసింది. ప్రధానంగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ పనులు, అత్యాధునిక సాంకేతిక ప్రాజెక్టులు, గ్లోబల్ డేటా సెంటర్లు రాష్ట్రానికి తరలిరావడాన్ని యూఏఈ మంత్రి ప్రత్యేకంగా ప్రశంసించారు.

మరోవైపు ఆక్వా రంగంలో ఆంధ్రప్రదేశ్ ప్రాధాన్యతను గుర్తించిన యూఏఈ బృందం, రాష్ట్రం నుంచి అత్యున్నత నాణ్యత కలిగిన రొయ్యలు, ఇతర ఆక్వా ఉత్పత్తులను యూఏఈ మార్కెట్లకు నేరుగా దిగుమతి చేసుకునే అంశంపై సానుకూలంగా స్పందించింది. ఇరు ప్రాంతాల మధ్య వాణిజ్య, ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.