తండ్రికి చెందిన ఆస్తిలో కొడుకు జన్మహక్కు కింద వాటా కోరలేడని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తాత నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తి పంపకాల తర్వాత తండ్రికి ప్రత్యేక ఆస్తిగా మారితే, అందులో కొడుకుకు పుట్టుకతోనే హక్కు ఏర్పడదని పేర్కొంది. ఈ మేరకు ఆస్తిలో సగం వాటా కోరుతూ దాఖలైన అప్పీల్‌ను కొట్టివేసింది.

ఈ కేసు 1997లో దాఖలైన ఆస్తి విభజన వ్యాజ్యానికి సంబంధించినది. 1,811 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఆస్తి తొలుత తన తాతకు చెందిందని, వారసత్వంగా తనకు జన్మహక్కు వచ్చిందని ఓ మైనర్ బాలుడు కోర్టును ఆశ్రయించాడు. తల్లి ద్వారా ఈ పిటిషన్ దాఖలు చేయించి ఆస్తిలో సగం వాటా కోరాడు.

అయితే, ఆ బాలుడు పుట్టకముందే తాత మరణించారని, వారసత్వ ప్రక్రియ ప్రారంభమైందని సుప్రీంకోర్టు గుర్తుచేసింది. తాత ఆస్తిపై 1993లోనే విభజన ప్రక్రియ ప్రారంభమైంది. 1994 జనవరి 6న బాలుడు జన్మించగా, అదే ఏడాది ఫిబ్రవరి 3న ఆస్తి విషయంలో ఒప్పందం కుదిరింది.

హిందూ వారసత్వ చట్టం-1956 ప్రకారం తాత ఆస్తి ఆయన క్లాస్‌-1 వారసులకు సంక్రమించిందని ధర్మాసనం పేర్కొంది. ఆస్తి విభజన తర్వాత ఒక్కొక్కరికి వచ్చిన వాటాలు వారి ప్రత్యేక ఆస్తులుగా మారాయని వివరించింది. ఈ క్రమంలో బాలుడి తండ్రికి వచ్చిన వాటా కూడా ఆయన వ్యక్తిగత ఆస్తిగా మారిందని తెలిపింది.

తండ్రి తన వాటాను విక్రయించినప్పటికీ ఆ అమ్మకపు పత్రాలను ఎవరూ సవాలు చేయలేదని కోర్టు గుర్తించింది. పంపకాల్లో తండ్రికి వచ్చిన ఆస్తిపై కుమారుడికి జన్మహక్కు ఉండదని, ఆ ఆస్తిలో అతడు ఉమ్మడి హక్కుదారుడిగా (కోపార్సెనర్‌) హక్కు పొందలేడని స్పష్టం చేసింది. దీంతో కింది కోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొంటూ అప్పీల్‌ను కొట్టివేసింది.