ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించినప్పటికీ.. కొన్ని చోట్ల ఎదురైన పరాజయాలపై మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ దృష్టి సారించారు. ఓటమికి దారితీసిన కారణాలను గుర్తించి, భవిష్యత్తులో అలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా పార్టీ నేతల నుంచి నాలుగు అంశాలపై నివేదికలు కోరినట్లు సమాచారం.

మున్సిపల్‌ ఎన్నికల్లో కూటమి మంచి ఫలితాలు సాధించింది. అయితే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి వైసీపీ నుంచి పలు చోట్ల గట్టి పోటీ ఎదురైంది. ఫలితంగా 76 జడ్పీటీసీ స్థానాలతో పాటు 1,700 ఎంపీటీసీ స్థానాల్లో కూటమి ఓటమి చవిచూసింది. ఈ పరాజయాలకు కారణాలేంటన్నది తెలుసుకునేందుకు లోకేశ్‌ సమీక్షకు సిద్ధమయ్యారు.

ఓటమికి దారితీసిన అంశాలను నాలుగు కేటగిరీలుగా విభజించి వివరాలు సేకరించాలని పార్టీ నేతలను కోరారు. తొలుత క్యాడర్‌ అభిప్రాయాలకు విరుద్ధంగా అభ్యర్థులను ఎంపిక చేయడం వల్ల ఓడిపోయిన స్థానాలను గుర్తించాలని సూచించారు. ఎమ్మెల్యేల పనితీరు సరిగా లేక పరాజయం ఎదురైన స్థానాలు రెండో విభాగం కింద విభజించారు. కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపంతో ఓడిపోయిన స్థానాలు మూడో విభాగంగా గుర్తించాలన్నారు. వైసీపీకి సంస్థాగతంగా బలం ఉండటం వల్ల ఓటమి ఎదురైన స్థానాలు నాలుగో విభాగంగా నమోదు చేయాలని సూచించారు.

పరిషత్‌ ఎన్నికల్లో కూటమి ఓటమికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నట్లు విశ్లేషణలు చెబుతున్నాయి. కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటులో లోపాలు ఒక కారణమని తెలుస్తోంది. గెలిచే అవకాశమున్న పార్టీకి కాకుండా, కోటా ప్రాతిపదికన బలహీనమైన పార్టీకి కొన్ని స్థానాలు కేటాయించడం, బలహీన అభ్యర్థులను బరిలోకి దించడం వంటివి ప్రభావం చూపినట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు వైసీపీ నుంచి ఇంతటి పోటీ ఎదురవుతుందని కూటమి అంచనా వేయలేకపోయిందని, ఆ పార్టీ క్షేత్రస్థాయి బలం కూడా కొన్ని చోట్ల ఫలితాలను ప్రభావితం చేసిందని విశ్లేషణలు పేర్కొంటున్నాయి.

నాలుగు అంశాలపై నివేదికలు అందిన తర్వాత లోకేశ్‌ వాటిని పరిశీలించి, లోపాలను సరిదిద్దే చర్యలు చేపట్టే అవకాశం ఉంది.