ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్‌ భేటీ అయ్యారు. విశాఖపట్నంలో జరుగుతున్న సీఐఐ (భారత పరిశ్రమల సమాఖ్య) 31వ భాగస్వామ్య సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన వీరిద్దరూ మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణకు జరుగుతున్న ప్రయత్నాలపై చర్చించుకున్నారు.

రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు పలువురు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారని, అందుకు సంబంధించిన వివరాలను మంత్రి నారా లోకేశ్‌ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు వివరించారు. రాష్ట్ర అభివృద్ధికి దోహదపడే ఈ పెట్టుబడులను ఆకర్షించేందుకు మంత్రి లోకేశ్‌ చూపుతున్న చొరవను పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా అభినందించారు.

భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తితో ముందుకు సాగి, మరిన్ని పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకురావాలని పవన్ ఆకాంక్షించారు. ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఇద్దరు నేతల మధ్య ఈ భేటీ జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది.