ఉత్తరాఖండ్‌లో ఒళ్లు గగుర్పొడిచే ఘటన చోటుచేసుకుంది. రోడ్డుపై ఎదురైన అడవి ఏనుగు ఓ బైకర్‌పై రెండుసార్లు కాలు మోపింది. అయినప్పటికీ ఆ వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. ఏనుగు అక్కడి నుంచి వెళ్లిపోగానే వెంటనే లేచి నిలబడటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

హరిద్వార్‌-డెహ్రాడూన్‌ జాతీయ రహదారిపై నేపాలీ ఫామ్‌ సమీపంలో గురువారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. రహదారిపై వెళ్తున్న బైకర్‌కు అకస్మాత్తుగా ఏనుగు ఎదురైంది. ఈ క్రమంలో ఆ ఏనుగు అతడి పొట్ట, ఛాతీపై రెండుసార్లు కాలు మోపింది. దీంతో అతడు దాని కాళ్ల కింద చిక్కుకుపోయాడు. అయితే ఏనుగు అక్కడి నుంచి వెళ్లిపోగానే బైకర్‌ వెంటనే పైకి లేచాడు. అతడికి ఎలాంటి గాయాలైనట్లు కనిపించలేదు.

ఈ భయానక ఘటనను అటుగా వెళ్తున్న క్యాబ్‌ డ్రైవర్‌, డిజిటల్‌ కంటెంట్‌ క్రియేటర్‌ శివ శర్మ తన కెమెరాలో బంధించారు. నవంబర్‌ 12న తెల్లవారుజామున 3.46 గంటలకు ఫేస్‌బుక్‌లో వీడియోను పోస్ట్‌ చేశారు. హరిద్వార్‌-డెహ్రాడూన్‌ మార్గంలో ప్రయాణం సులభంగానే ఉన్నా.. ఏనుగులు అనూహ్యంగా రోడ్డుపైకి రావడంతో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేమని శర్మ పేర్కొన్నారు. అంతటి ప్రమాదం నుంచి బైకర్‌ బయటపడటం అదృష్టమని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

రాజాజీ టైగర్‌ రిజర్వ్‌ సమీపంలో ఈ రహదారి ఉండటంతో ఇక్కడ తరచూ ఏనుగులు కనిపిస్తుంటాయి. ముఖ్యంగా తెల్లవారుజామున, అర్ధరాత్రి వేళల్లో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఏనుగులు కనిపిస్తే వేగం తగ్గించి, వాటికి దగ్గరగా వెళ్లకుండా దూరం పాటించాలని హెచ్చరిస్తున్నారు.

క్లుప్తంగా: ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌-డెహ్రాడూన్‌ రహదారిపై ఓ బైకర్‌పై ఏనుగు రెండుసార్లు కాలు మోపింది. అయినా అతడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటనను క్యాబ్‌ డ్రైవర్‌ వీడియో తీశారు.