కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. గురువారం (12వ తేదీ) విశాఖపట్నంలో ప్రారంభం కానున్న 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సు-2026 ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. దీనితో పాటు ‘మహిళా ప్రగతి సదస్సు-2026’ ప్రారంభ కార్యక్రమంలోనూ ఆయన పాల్గొంటారు.

ఈ పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అమిత్ షాతో ప్రత్యేకంగా సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. అలాగే, రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుపై కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాశ్వాన్‌తో ఆయన చర్చలు జరుపుతారు. 13న కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, నితిన్ గడ్కరీలతో కూడా ముఖ్యమంత్రి భేటీ అవుతారు.

విశాఖపట్నంలో రెండు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సులో ప్రపంచ పారిశ్రామిక దిగ్గజాలు, అంతర్జాతీయ ప్రతినిధులు, దౌత్యవేత్తలు, బహుళజాతి కంపెనీల సీఈవోలు పాల్గొంటారు. తయారీ రంగం, పునరుత్పాదక ఇంధనం, ఫుడ్ ప్రాసెసింగ్, అధునాతన సాంకేతికత, మౌలిక సదుపాయాలు, ఉపాధి కల్పన వంటి అంశాలపై ఈ సదస్సు ప్రధానంగా దృష్టి సారించనుంది. ఈ సందర్భంగా కియా సంస్థతో ప్రత్యేక ఒప్పందంతో పాటు పలు కీలక ఎంఓయూలు, ప్రభుత్వ ఉత్తర్వుల జారీ వంటి కార్యక్రమాలు జరగనున్నాయి.

ఈ సదస్సులో భాగంగా సీఎం చంద్రబాబు సింగపూర్, యూఏఈ మంత్రులు, జపాన్, రష్యా రాయబారులతో పాటు పలువురు అంతర్జాతీయ ప్రతినిధులతో చర్చలు జరుపుతారు. అదేవిధంగా, రెన్యూ, కియా ఇండియా, ఆర్పీఎస్‌జీ గ్రూప్, మెయిల్ వంటి సంస్థల అధినేతలతో పాటు స్పేస్ టెక్నాలజీ కంపెనీలైన అగ్నికుల్, స్కైరూట్ ప్రతినిధులతోనూ ఆయన ప్రత్యేకంగా సమావేశమవుతారు.