భారత్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో మిగిలిన మ్యాచ్‌ల కోసం న్యూజిలాండ్‌ జట్టులో మార్పులు చోటుచేసుకున్నాయి. 31 ఏళ్ల కుడిచేతి వాటం ఫాస్ట్‌ బౌలర్‌ బ్రెట్‌ రాండెల్‌కు తొలిసారి జాతీయ జట్టులో చోటు దక్కింది. నాలుగు, అయిదో వన్డేల కోసం అతడిని ఎంపిక చేసినట్లు న్యూజిలాండ్‌ క్రికెట్‌ గురువారం ప్రకటించింది. మరోవైపు ఆల్‌రౌండర్‌ జోష్‌ క్లార్క్‌సన్‌ను కూడా జట్టులోకి తీసుకుంది.

రాండెల్‌ ఇప్పటివరకు 145 ప్రొఫెషనల్‌ మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో న్యూజిలాండ్‌-ఏ తరఫున అయిదు మ్యాచ్‌లు ఉన్నాయి. ఇటీవల డెర్బీషైర్‌ తరఫున కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొని తిరిగొచ్చాడు. దేశవాళీ క్రికెట్‌లో కొంతకాలంగా నిలకడగా రాణిస్తున్న అతడికి అంతర్జాతీయ జట్టులో అవకాశం రావడం సంతోషంగా ఉందని కోచ్‌ రాబ్‌ వాల్టర్‌ అన్నారు.

ఆరు వన్డేలు ఆడిన జోష్‌ క్లార్క్‌సన్‌ కూడా తిరిగి జాతీయ జట్టులోకి వచ్చాడు. ఈ ఏడాది ఏప్రిల్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన సిరీస్‌లో చివరిసారిగా న్యూజిలాండ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. సిరీస్‌ మధ్యలో చోటుచేసుకున్న మార్పుల నేపథ్యంలో రాండెల్‌, క్లార్క్‌సన్‌లను అందుబాటులోకి తీసుకున్నట్లు వాల్టర్‌ తెలిపారు.

అయిదు వన్డేల సిరీస్‌లో భారత్‌ 2-0తో ఆధిక్యంలో ఉంది. మూడో వన్డే ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయింది. శుక్రవారం మౌంట్‌ మాంగనుయ్‌లోని బే ఓవల్‌ వేదికగా నాలుగో వన్డే జరగనుంది. ఆదివారం ఇదే మైదానంలో చివరి మ్యాచ్‌ నిర్వహించనున్నారు.