వాహనాన్ని ఓవర్‌టేక్ చేశాడన్న చిన్న వివాదం ఓ యువకుడి జీవితాన్ని ఛిద్రం చేసింది. ముగ్గురు మైనర్లు కొడవళ్లు, ఇతర పదునైన ఆయుధాలతో దాడి చేయడంతో 26 ఏళ్ల యువకుడు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నాడు. మహారాష్ట్రలోని పుణే జిల్లాలో పట్టపగలే జరిగిన ఈ కిరాతక ఘటన తీవ్ర కలకలం రేపింది.

పుణే జిల్లా ఖేడ్ తాలూకాలోని టిన్హవాడి గ్రామానికి చెందిన శివం బాలాసాహెబ్ కర్మారే (26) నవంబర్ 10వ తేదీన మధ్యాహ్నం 2:45 గంటలకు తన బైక్‌పై రాజ్గురునగర్ ప్రాంతంలో ప్రయాణిస్తున్నాడు. అంతకుముందు వాహనం ఓవర్‌టేక్ విషయంలో కొందరితో అతనికి వాగ్వివాదం జరిగింది. ఈ విషయాన్ని మనసులో పెట్టుకున్న ముగ్గురు మైనర్లు మార్గమధ్యంలో శివంను అడ్డగించి, కొడవళ్లు, ఇతర ఆయుధాలతో విచక్షణారహితంగా దాడి చేశారు.

ఈ దాడిలో శివం తల, వీపు, చేతులపై తీవ్ర గాయాలయ్యాయి. అతని మూడు వేళ్లు తెగిపోగా, ఒక చేయి పూర్తిగా చచ్చుబడిపోయిందని తెలుస్తోంది. తీవ్ర రక్తస్రావంతో ఉన్న అతన్ని స్థానికులు ఆసుపత్రికి తరలించగా, వైద్యులు సుమారు 700 కుట్లు వేశారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉంది.

బాధితుడి సోదరుడు ఆదిత్య కలురాం కర్మారే ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. రాక్షేవాడి ప్రాంతంలో దాక్కున్న ముగ్గురు మైనర్లను గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు ఇన్‌స్పెక్టర్ సంతోష్ గిరిగోసవి తెలిపారు. పట్టపగలే జరిగిన ఈ దాడితో స్థానిక ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.