ఆంధ్రప్రదేశ్‌ను పెట్టుబడులకు స్వర్గధామంగా, పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో విశాఖపట్నంలో జరగనున్న 31వ సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్–2026 కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ఒకరోజు ముందుగానే విశాఖకు చేరుకుంటున్నారు. నవంబర్ 12, 13వ తేదీల్లో జరగనున్న ఈ ప్రతిష్ఠాత్మక సదస్సు ప్రారంభానికి ముందే అంతర్జాతీయ ప్రతినిధులు, వివిధ దేశాల మంత్రులు, పారిశ్రామిక దిగ్గజాలతో సీఎం వరుస సమావేశాలు నిర్వహించనున్నారు. పెట్టుబడుల సమీకరణలో సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ, రాష్ట్రంలో ఉన్న అనుకూలతలు, పారిశ్రామిక విధానాలను అంతర్జాతీయ వేదికపై బలంగా వినిపించేందుకు ముఖ్యమంత్రి ముందస్తుగానే రంగంలోకి దిగుతున్నారు.

ముఖ్యమంత్రి తన షెడ్యూల్‌లో భాగంగా బుధవారం ఉదయం అమరావతిలో సింగపూర్ మంత్రి గాన్ సియో హువాంగ్‌తో సమావేశమవుతారు. అనంతరం నేరుగా విశాఖపట్నం చేరుకుని వరుస భేటీల్లో పాల్గొంటారు. 

ప్రపంచ మేధోసంపత్తి సంస్థ (డబ్ల్యూఐపీవో) డైరెక్టర్ జనరల్ డాక్టర్ డారెన్ టాంగ్, జపాన్ రాయబారి కీచి ఒనో, యూఏఈ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మార్రీలతో పాటు రెన్యూ పవర్ సంస్థ సీఈవో సుమంత్ సిన్హాతో సీఎం ప్రత్యేకంగా చర్చలు జరుపుతారు. బుధవారం సాయంత్రం పలు బహుళజాతి సంస్థల సీఈవోలతో భేటీ అయ్యాక, అంతర్జాతీయ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక స్వాగత విందులో ముఖ్యమంత్రి పాల్గొంటారు.

విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంగణంలో నవంబర్ 12వ తేదీ ఉదయం 10.30 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ 31వ భాగస్వామ్య సదస్సును అధికారికంగా ప్రారంభించనున్నారు. గతంలో నిర్వహించిన సదస్సులకు భిన్నంగా ఈసారి సదస్సు ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. 

ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఐదు ప్రాంతీయ సదస్సుల ద్వారా సుమారు రూ.86 వేల కోట్ల పెట్టుబడులు ఆకర్షించగా, ఈ ప్రధాన సమ్మిట్ ద్వారా రాష్ట్రాభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సీఐఐ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ సదస్సుకు సింగపూర్, యూఏఈ, జపాన్, రష్యా, స్లోవేకియా, గ్వాటెమాల తదితర దేశాల మంత్రులు, రాయబారులు, దౌత్యవేత్తలు తరలివస్తున్నారు.

రెండు రోజుల పాటు సాగే ఈ సదస్సులో కియా మోటార్స్, రెన్యూ, మాండెలెజ్ ఇండియా, సెయింట్ గోబెయిన్, నాల్కో, లెవిస్టా వంటి దిగ్గజ సంస్థల ప్రతినిధులు హాజరుకానున్నారు. ఆటోమొబైల్, పునరుత్పాదక ఇంధనం, ఫుడ్ ప్రాసెసింగ్, నిర్మాణ రంగం, తయారీ, సాంకేతిక రంగాలలో పెట్టుబడులపై విస్తృత చర్చలు జరగనున్నాయి. 

ముఖ్యంగా అంతరిక్ష సాంకేతికత, తయారీ రంగాల్లో రాష్ట్రాన్ని ముందంజలో ఉంచేందుకు హాథోర్ రాకెట్స్, అగ్నికుల్, బెల్లాట్రిక్స్ ఏరోస్పేస్, స్కైరూట్ వంటి ప్రముఖ భారతీయ స్పేస్ స్టార్టప్ సంస్థల ప్రతినిధులతో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. జపాన్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన అంతర్జాతీయ వ్యూహాత్మక విభాగం చైర్మన్‌తోనూ సీఎం చర్చలు జరపనున్నారు.

సదస్సులో భాగంగా మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు విశాఖ నోవోటెల్ వేదికగా 'విమెన్ అండ్ గ్రోత్ సమ్మిట్–2026' పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి సీఎం హాజరై మహిళల ఆర్థిక సాధికారత, వ్యాపార రంగంలో మహిళలకు అందించే తోడ్పాటుపై మాట్లాడనున్నారు. మరోవైపు, సదస్సుకు విచ్చేస్తున్న కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్, చిరాగ్ పాశ్వాన్, ప్రహ్లాద్ జోషి, సర్బానంద సోనోవాల్‌లతో ముఖ్యమంత్రి వేర్వేరుగా సమావేశమవుతారు. 

రాష్ట్రంలో పారిశ్రామిక మౌలిక వసతుల విస్తరణకు కేంద్రం నుంచి అందాల్సిన సహకారం, అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర ఉత్పత్తులకు కల్పించాల్సిన వెసులుబాట్లపై కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు. ఈ విధంగా సదస్సు ప్రారంభానికి ముందే ముఖ్యమంత్రి చంద్రబాబు చేపట్టిన ముందస్తు మంతనాలు రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను తెచ్చిపెడతాయన్న ఆశాభావం వ్యక్తమవుతోంది.