తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క హనుమకొండ పర్యటన నేపథ్యంలో పోలీసులు ముందస్తు భద్రతా చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా వరంగల్ పశ్చిమ మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ సీనియర్ నేత దాస్యం వినయ్ భాస్కర్‌ను ఈ ఉదయం పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. హనుమకొండ వడ్డేపల్లిలోని ఆయన నివాసానికి చేరుకున్న పోలీసులు, ఆయన బయటకు రాకుండా నిర్బంధించారు.

కాజీపేట పరిధిలోని వైఎస్సార్ నగర్ నివాసితులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలనే డిమాండ్‌పై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వకపోతే, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటనను అడ్డుకుంటామని బీఆర్‌ఎస్ నేతలు హెచ్చరించారు. ఈ క్రమంలో వినయ్ భాస్కర్ స్పందిస్తూ... "వైఎస్సార్ నగర్ గుడిసెవాసులకు న్యాయం చేయకపోతే భట్టి పర్యటన అడ్డుకుంటాం. పట్టాలపై స్పష్టమైన ప్రకటన చేయాలి.. లేదంటే నిరసన తప్పదు" అని స్పష్టం చేశారు.

ఈ హెచ్చరికల నేపథ్యంలో ఎలాంటి శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు పోలీసులు అప్రమత్తమయ్యారు. వినయ్ భాస్కర్ ఇంటి వద్ద గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు, స్థానికంగా ఉన్న పలువురు బీఆర్‌ఎస్ ముఖ్య నేతలు, కార్యకర్తలను కూడా ముందస్తుగా అదుపులోకి తీసుకుంటున్నారు.