భర్త రాజీవ్‌ గాంధీ రాజకీయాల్లోకి రావడాన్ని తాను తీవ్రంగా వ్యతిరేకించానని, ఆయన ఆ రంగంలోకి వెళ్లవద్దని వేడుకున్నానని కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్‌ సోనియా గాంధీ వెల్లడించారు. అయితే కుమారుడు రాహుల్‌ గాంధీ రాజకీయాల్లోకి రావాలనుకున్నప్పుడు మాత్రం తాను అడ్డుకోలేదని తెలిపారు. తన జీవిత ప్రయాణాన్ని వివరిస్తూ రాసిన ‘బిలాంగింగ్‌: ఏ జర్నీ ఆఫ్‌ లవ్‌’ పుస్తకంలో ఈ విషయాలను ప్రస్తావించారు. ఈ పుస్తకం మంగళవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.

రాహుల్‌కు చిన్నప్పటి నుంచే రాజకీయాలపై ఆసక్తి ఉండేదని సోనియా గుర్తుచేసుకున్నారు. ముప్పు ఉందని తెలిసినా రాజీవ్‌ ధైర్యంగా రాజకీయాల్లో కొనసాగిన తీరును రాహుల్‌ గౌరవించేవారని తెలిపారు. రాజీవ్‌ రాజకీయాల్లోకి వెళ్లవద్దని దశాబ్దాల క్రితమే తాను వేడుకున్నానని, ఆ నిర్ణయం వల్ల కుటుంబం కూడా ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి వెళ్లాల్సి వస్తుందని ఆందోళన చెందానని పుస్తకంలో రాశారు. తండ్రి రాజకీయాల్లో కొనసాగడంపై రాహుల్‌ విభేదించిన సందర్భాలు కూడా ఉన్నాయన్నారు. అయినప్పటికీ రాజీవ్‌ విలువలు, ధైర్యం పట్ల ఆయనకు ఎంతో గౌరవం ఉండేదని పేర్కొన్నారు.

ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ నియోజకవర్గంతో రాహుల్‌, ప్రియాంక గాంధీ వాద్రాలకు విడదీయలేని అనుబంధం ఉందని సోనియా తెలిపారు. రాహుల్‌ను చిన్నతనంలోనే రాజీవ్‌ పలుమార్లు అమేథీకి తీసుకెళ్లారని, గ్రామీణ ప్రాంతాల వాస్తవ పరిస్థితులను దగ్గరగా పరిచయం చేసేందుకు కూడా ప్రయత్నించారని గుర్తుచేసుకున్నారు. ప్రియాంక కూడా కుటుంబం పోటీ చేసిన ప్రతి ఎన్నికలో అమేథీలోనే ఉండి పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు దగ్గరయ్యారని చెప్పారు.

అయితే ఆ సమయంలో ప్రియాంక ప్రధానంగా తన పిల్లల పెంపకం, బౌద్ధ అధ్యయనాల్లో పోస్టు గ్రాడ్యుయేట్‌ డిప్లొమా పూర్తి చేయడంపై దృష్టి పెట్టారని సోనియా వివరించారు. రాహుల్‌ విదేశాల నుంచి భారత్‌కు వచ్చినప్పుడల్లా తాను లేదా ప్రియాంకతో కలిసి అమేథీకి వెళ్లేవారని తెలిపారు. ఆ పర్యటనల సమయంలోనే అక్కడి ప్రజలతో మరింతగా మమేకమై, వారి తరఫున పనిచేయాలనే ఆసక్తి రాహుల్‌లో పెరిగిందని పేర్కొన్నారు.

కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో రాహుల్‌ ఎంఫిల్‌ కోసం డెవలప్‌మెంట్‌ స్టడీస్‌ ఎంచుకున్నారని సోనియా తెలిపారు. విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న సమయంలోనూ భారత్‌లో రాజకీయ పరిణామాలను నిశితంగా గమనించేవారని చెప్పారు. రాహుల్‌ క్రియాశీల రాజకీయాల్లోకి రావాలని పార్టీ నేతలు బలంగా కోరారని, ఆ నిర్ణయం తీసుకుంటే ఆయన జీవన విధానం పూర్తిగా మారిపోతుందని వివరించారు. ప్రజా జీవితంలోకి వచ్చాక ప్రతి అడుగునా పరిశీలన, విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుందని రాహుల్‌కు తెలుసన్నారు. తనతో, ప్రియాంకతో చర్చించిన తర్వాత, చాలాసేపు ఆలోచించి ఆయన రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నారని సోనియా వెల్లడించారు.

2004 మార్చిలో అమేథీ నుంచి పోటీ చేస్తానని రాహుల్‌ ప్రకటించారు. సోనియా గాంధీ పక్కనే ఉన్న రాయ్‌బరేలీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. తొలి ఎన్నికలోనే రాహుల్‌ భారీ మెజార్టీతో గెలిచారని సోనియా పేర్కొన్నారు. అనంతరం తన బాధ్యతలను ఉత్సాహంగా స్వీకరించి, రాజీవ్‌ గాంధీ తరహాలో గ్రామీణ అమేథీలో పరిశ్రమలు, వ్యాపార సంస్థల ఏర్పాటుకు కృషి చేశారని తెలిపారు.