కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రచించిన 'బిలాంగింగ్: ఏ జర్నీ ఆఫ్ లవ్' ఆత్మకథలో ఒక పొరపాటు దొర్లింది. పార్టీలో అత్యంత విశ్వసనీయ నేత, తన రాజకీయ కార్యదర్శి అయిన అహ్మద్ పటేల్ మరణించిన సంవత్సరాన్ని ఆమె ఈ పుస్తకంలో తప్పుగా పేర్కొన్నారు. 

"అహ్మద్ పటేల్ 2022లో కొవిడ్ మహమ్మారి వల్ల మరణించే వరకు నా రాజకీయ కార్యదర్శిగా కొనసాగారు. ఆయన మరణం పార్టీలో పూడ్చలేని లోటును మిగిల్చింది" అని పేర్కొన్నారు. అయితే, వాస్తవానికి అహ్మద్ పటేల్ 2020, నవంబర్ 25న కన్నుమూశారు. 2020 అక్టోబర్‌లో కొవిడ్ బారిన పడిన ఆయన, గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.

కాంగ్రెస్ వర్గాల్లో 'ఏపీ'గా సుపరిచితులైన అహ్మద్ పటేల్, సోనియా గాంధీకి అత్యంత కీలక సలహాదారుగా, పార్టీ కోశాధికారిగా బాధ్యతలు నిర్వహించారు. నిశ్శబ్ద వ్యూహకర్తగా ఉంటూ పార్టీలో తలెత్తిన అనేక సంక్షోభాలను పరిష్కరించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.

ఈ పొరపాటుపై అహ్మద్ పటేల్ కుమార్తె ముంతాజ్ పటేల్ స్పందిస్తూ.. దీనిని తాము పెద్ద విషయంగా పరిగణించడం లేదని తెలిపారు. గాంధీ కుటుంబం నుంచి వచ్చిన తొలి వ్యక్తిగత ఆత్మకథ ఇదని, తన తండ్రి సేవలను సోనియా గాంధీ సముచితంగా గుర్తించడం సంతోషకరమని పేర్కొన్నారు. పార్టీకి ద్రోహం చేసిన వారిని తన తండ్రి ఎన్నడూ క్షమించరని పుస్తకంలో రాసిన వాక్యం, ఆయన నిరుపమాన విధేయతను అద్దం పడుతోందని ఆమె అభిప్రాయపడ్డారు.