తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రముఖ సినీ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా జన్మదిన, దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక ప్రత్యేక పోస్ట్ పెట్టారు. రేవంత్ రెడ్డి పుట్టినరోజు, దీపావళి పండుగ ఒకే సమయంలో రావడంతో ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆసక్తికర సందేశాన్ని జోడించారు.

"గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి జన్మదిన మరియు దీపావళి శుభాకాంక్షలు. మీరు లక్షలాది నరకాసురులపై విజయం సాధించాలని, శ్రీరాముడి ధైర్యం, దృఢ సంకల్పం, ధర్మంతో సగర్వంగా నిలబడాలని కోరుకుంటున్నాను" అని సందీప్ రెడ్డి వంగా పేర్కొన్నారు.

ఈ శుభాకాంక్షల సందేశంతో పాటు రేవంత్ రెడ్డి చాలా కాలం క్రితం నాటి, యంగ్ లుక్‌లో ఉన్న ఒక అరుదైన ఫొటోను కూడా సందీప్ వంగా పంచుకున్నారు. రేవంత్ రెడ్డికి సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు అందుతుండగా, దర్శకుడు సందీప్ వంగా చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.