హైదరాబాద్ నగరంలోని నల్లకుంటలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాంగ్ రూట్‌లో వేగంగా వచ్చిన ఓ బైకర్ ఢీకొనడంతో ఉస్మానియా విశ్వవిద్యాలయం మైనింగ్ ఇంజినీరింగ్ విద్యార్థిని ఆయేషా ముస్ఫిరా (21) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. తన తండ్రి మహ్మద్ ఆరిఫ్‌తో కలిసి బైక్‌పై కళాశాలకు వెళుతుండ‌గా ఈ విషాదం జరిగింది.

వివరాల్లోకి వెళితే.. ఆయేషా తన తండ్రితో కలిసి బైక్‌పై ప్రయాణిస్తుండగా, నల్లకుంట ఫీవర్ ఆసుపత్రి సమీపంలో ఎస్బీఐ ఉద్యోగి అయిన బీఎం ధర్మరాజు తన బైక్‌పై రాంగ్ రూట్‌లో వచ్చాడు. ఈ క్రమంలో ఆర్టీసీ బస్సు సమీపంలో వీరి వాహనాన్ని ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఆయేషా తలకు తీవ్ర గాయాలై, తండ్రి కళ్ల ముందే కుప్పకూలింది. నిమిషాల క్రితం వరకు తనతో నవ్వుతూ మాట్లాడిన కుమార్తె విగతజీవిగా పడి ఉండటాన్ని చూసి ఆ తండ్రి గుండెలవిసేలా రోదించడం అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది.

ప్రమాదానికి కారణమైన నిందితుడు బీఎం ధర్మరాజును అరెస్ట్ చేసినట్లు సీపీ సజ్జనార్ తెలిపారు. కేవలం రెండు నిమిషాల సమయం ఆదా చేసుకునేందుకు చేసే రాంగ్ రూట్ ప్రయాణం ఇతరుల జీవితాలకు ఎలా ముప్పుగా మారుతుందో ఈ ఘటనే నిదర్శనమని ఆయన అన్నారు. బ్యాంకు ఉద్యోగి నిర్ల‌క్ష్యం ఓ ఇంటి దీపాన్ని ఆర్పేసిందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. విద్యావంతులు, బాధ్యతాయుతమైన పౌరులు ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం అత్యంత బాధాకరమని, ఇలాంటి నిర్లక్ష్యం క్షమించరాని నేరమని హెచ్చరించారు.