సినిమా పాటలతో యువతను ఉర్రూతలూగించే సంగీత దర్శకుడు అనిరుధ్‌ రవిచందర్‌.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సీఈఓ కావ్య మారన్‌ వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారు. ఈ వేడుకకు గ్రీస్‌ వేదికవుతోంది. ఇంతకీ ఈ ప్రత్యేక వేడుకకు గ్రీస్‌నే ఎందుకు ఎంచుకున్నారని చాలా మంది నెటిజన్లు ఆరా తీస్తున్నారు. దానికి గల కారణాలేంటో చూద్దాం..

శాంటోరిని సమీపంలో వేడుకలు
గ్రీస్‌లోని శాంటోరిని సమీపంలో వివాహ వేడుకలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ వేడుకకు పలువురు ప్రముఖులు హాజరవుతున్నట్లు తెలుస్తోంది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్‌, సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ విమానాశ్రయంలో కనిపించిన ఫొటోలు, వీడియోలు ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. అతిథుల కోసం మారన్‌ కుటుంబం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. నాలుగు ప్రత్యేక విమానాలను కూడా ఏర్పాటు చేసినట్లు సమాచారం.

ఆరుబయట వేడుకలకు అనువైన వాతావరణం
గ్రీస్‌లో ఏడాదికి దాదాపు 300 రోజులు ఎండ ఉంటుంది. మధ్యధరా సముద్ర తీర ప్రాంత వాతావరణం ఆరుబయట వివాహ వేడుకలకు అనుకూలంగా ఉంటుంది. సముద్రాన్ని వీక్షిస్తున్నట్లుగా కొండ అంచులు, ప్రకృతి అందాల మధ్య పెళ్లి వేడుకలు నిర్వహించుకునే వెసులుబాటు ఉండడంతో చాలా మంది గ్రీస్‌ను ఎంచుకుంటుంటారు.

ఫొటోలకు అద్భుతమైన నేపథ్యం
తెల్లని భవనాలు, నీలి సముద్రం, పురాతన కట్టడాలు గ్రీస్‌ ప్రత్యేకతలు. వీటి మధ్య తీసుకునే వివాహ ఫొటోలు జీవితాంతం గుర్తుండిపోతాయి. ముఖ్యంగా సాయంత్రం వేళ సూర్యాస్తమయ కాంతులు ఫొటోలకు మరింత అందాన్ని ఇస్తాయి.

బీచ్‌ల నుంచి పర్వత గ్రామాల వరకు..
గ్రీస్‌లోని స్వచ్ఛమైన సముద్ర తీరాలు, నీలి రంగు జలాలు పర్యాటకులను ఆకర్షిస్తాయి. మరోవైపు సంప్రదాయ గ్రామాలతో కూడిన పర్వత ప్రాంతాలు ప్రశాంతమైన వాతావరణాన్ని అందిస్తాయి. ఇలా ఒకే దేశంలో విభిన్న ప్రకృతి అందాలను ఆస్వాదించవచ్చు.

ఆతిథ్యం.. రుచికరమైన వంటకాలు
గ్రీస్‌ సంస్కృతిలో అతిథులకు ప్రత్యేక స్థానం ఉంది. 'ఫిలోక్సేనియా' అనే గ్రీకు పదానికి అపరిచితుడిని స్నేహితుడిగా ఆదరించడం అని అర్థం. ఇక అక్కడి వంటకాల్లో తాజా కూరగాయలు, సీ ఫుడ్‌, మాంసాహార వంటకాలకు ప్రాధాన్యం ఉంటుంది. శాకాహారులకు అనువైన వంటకాలు కూడా అందుబాటులో ఉంటాయి. స్థానిక ద్రాక్షతో తయారయ్యే వైన్‌లు, సంప్రదాయ డ్రింక్స్‌ వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఈ కారణాలతో గ్రీస్‌ ప్రపంచవ్యాప్తంగా ప్రముఖుల డెస్టినేషన్‌ వెడ్డింగ్‌లకు ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మారింది.