హైదరాబాద్ నగరంలో చెరువుల పునరుద్ధరణ, సుందరీకరణకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యంలో భాగంగా మరో ముందడుగు పడింది. మాదాపూర్ హైటెక్ సిటీ ప్రాంతంలోని చారిత్రక తమ్మిడికుంట చెరువుకు కొత్త శోభ సంతరించుకుంది. పునరుద్ధరణ పనులు పూర్తి చేసుకున్న ఈ చెరువును తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేడు సాయంత్రం లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున గౌరవ అతిథిగా హాజరుకానున్నారు. చెరువు అభివృద్ధికి ఆయన తనవంతు సహకారం అందించిన సంగతి తెలిసిందే.

హైటెక్ సిటీలోని శిల్పారామం సమీపంలో ఉన్న ఈ చెరువు, ఒకప్పుడు ఆక్రమణలు, చెత్తాచెదారం, నిర్మాణ వ్యర్థాలతో పూర్తిగా కుంచించుకుపోయింది. దీని పునరుద్ధరణ బాధ్యతలను 'హైడ్రా' (HYDRAA) చేపట్టింది. చెరువులో పేరుకుపోయిన సుమారు 30,000 ట్రక్కుల పూడిక, వ్యర్థాలను తొలగించి లోతు పెంచారు. ఫలితంగా చెరువు నీటి నిల్వ సామర్థ్యం గణనీయంగా పెరిగింది.

పునరుద్ధరణలో భాగంగా ప్రజలకు ఆహ్లాదాన్ని పంచేందుకు అనేక సౌకర్యాలు కల్పించారు. చెరువు చుట్టూ సుమారు 1.6 కిలోమీటర్ల పొడవైన వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్, పిల్లల కోసం ప్రత్యేక ప్లే ఏరియా, ఆహ్లాదకరమైన ల్యాండ్‌స్కేపింగ్ వంటివి ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెరగడంతో పాటు వర్షాకాలంలో వరద ముంపు సమస్యకు కూడా పరిష్కారం లభించనుంది. హైదరాబాద్‌లో 'హైడ్రా' తొలి దశలో చేపట్టిన చెరువుల పునరుద్ధరణ పనుల్లో తమ్మిడికుంట ఒకటి అని అధికారులు తెలిపారు.

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఇదే వేదికపై తమ్మిడికుంట చెరువుతో పాటు రామాంతపూర్‌లోని పెద్ద చెరువు అభివృద్ధి పనుల వల్ల నిరాశ్రయులైన 34 కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను సీఎం తన చేతుల మీదుగా అందజేయనున్నారు.