టెస్ట్ క్రికెట్‌లో పాకిస్థాన్ జట్టు ఒక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. శ్రీలంకతో రావల్పిండి వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో పాకిస్థాన్ తరఫున అరంగేట్రం చేసిన ముగ్గురు ఆటగాళ్లు ఒకే ఇన్నింగ్స్‌లో అర్ధశతకాలు సాధించి సత్తా చాటారు. 149 ఏళ్ల సుదీర్ఘ టెస్ట్ చరిత్రలో, ఒక జట్టు అరంగేట్ర టెస్టు కాని మ్యాచ్‌లో ముగ్గురు డెబ్యూటెంట్లు హాఫ్ సెంచరీలు చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ ఘనతతో పాకిస్థాన్ జట్టు పటిష్ఠ‌ స్థితిలో నిలిచింది.

జట్టులో సమూల మార్పులతో బరిలోకి దిగిన పాకిస్థాన్, ఈ మ్యాచ్‌లో నలుగురు కొత్త ఆటగాళ్లకు అవకాశం ఇచ్చింది. వీరిలో బ్యాటర్లు తయ్యబ్ ఆరిఫ్, మహ్మద్ తాహా, అరాఫత్ మిన్హాస్ తమ తొలి మ్యాచ్‌లోనే అర్ధశతకాలతో అదరగొట్టారు. తయ్యబ్ ఆరిఫ్ కేవలం 51 బంతుల్లోనే 57 పరుగులు చేసి దూకుడు ప్రదర్శించగా, మూడో స్థానంలో వచ్చిన మహ్మద్ తాహా 105 బంతుల్లో 51 పరుగులతో నిలకడగా ఆడాడు. ఆ తర్వాత అరాఫత్ మిన్హాస్ 9 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 52 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ఈ ముగ్గురి ప్రదర్శన పాకిస్థాన్ భారీ స్కోరుకు పునాది వేసింది.

గతంలో 1992లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వే తరఫున ముగ్గురు అరంగేట్ర ఆటగాళ్లు హాఫ్ సెంచరీలు చేశారు. అయితే అది జింబాబ్వేకు మొట్టమొదటి టెస్ట్ మ్యాచ్. కానీ, పాకిస్థాన్ జట్టు తమ అరంగేట్ర టెస్టు కాకుండానే ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది.

ఇదే మ్యాచ్‌లో పాకిస్థాన్ బ్యాటర్ సౌద్ షకీల్ శతకానికి చేరువలో విఫలమయ్యాడు. 199 బంతుల్లో 9 ఫోర్లతో 93 పరుగులు చేసిన అతను, శ్రీలంక బౌలర్ అసిత్ ఫెర్నాండో బౌలింగ్‌లో వికెట్ కీపర్ కుశాల్ మెండిస్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఫెర్నాండోకు ఇది 100వ టెస్ట్ వికెట్ కావడం గమనార్హం.

అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన శ్రీలంకను మరో అరంగేట్ర ఆటగాడు, బౌలర్ సాఖిబ్ ఖాన్ దెబ్బతీశాడు. అతను రెండు కీలక వికెట్లు పడగొట్టాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక జట్టు పాకిస్థాన్ మొదటి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 320 పరుగులు వెనుకబడి ఉంది. క్రీజులో కెప్టెన్ ధనంజయ డిసిల్వా (22), కమిందు మెండిస్ (40) ఉన్నారు. వెలుతురు సరిగా లేకపోవడంతో షెడ్యూల్ కంటే 25 నిమిషాల ముందే అంపైర్లు ఆటను నిలిపివేశారు.