భూమిపై బరువు చూసుకోవాలంటే త్రాసు లేదా వెయింగ్‌ మిషన్‌ ఉంటే సరిపోతుంది. మరి గురుత్వాకర్షణ లేని అంతరిక్షంలో పరిస్థితి ఏంటి? అక్కడ వ్యోమగాములు తమ బరువును ఎలా తెలుసుకుంటారు? ఇందుకోసం ప్రత్యేక పరికరం ఉంటుందని భారత సంతతికి చెందిన వ్యోమగామి అనిల్‌ మీనన్‌ ఓ వీడియో ద్వారా వివరించారు.

స్ప్రింగ్‌తో బరువు కొలత
అంతరిక్షంలో సాధారణ వెయింగ్‌ మిషన్లు పనిచేయవు. అందుకే వ్యోమగాములు స్ప్రింగ్‌ ఆధారంగా పనిచేసే ప్రత్యేక పరికరాన్ని ఉపయోగిస్తారు. ఇందులో అమర్చిన స్ప్రింగ్‌కు వ్యోమగామి అనుసంధానమై ఉంటారు. బటన్‌ నొక్కగానే స్ప్రింగ్‌ ముందుకు, వెనక్కి కదలడం ప్రారంభిస్తుంది. ఆ కదలికల ఆధారంగా వారి శరీర ద్రవ్యరాశిని పరికరం లెక్కిస్తుంది.

కదలికల వేగమే కొలమానం
ఈ పరికరం పనిచేసే విధానం ఆసక్తికరంగా ఉంటుంది. స్ప్రింగ్‌కు అనుసంధానించిన వ్యక్తి ద్రవ్యరాశిని బట్టి దాని కదలికల వేగం మారుతుంది. బరువైన వస్తువు, తేలికైన వస్తువు విషయంలో ఈ కదలికల సంఖ్య ఒకేలా ఉండదు. ఈ తేడాను గుర్తించి పరికరం ద్రవ్యరాశిని లెక్కిస్తుంది. భూమిపై మాదిరిగా గురుత్వాకర్షణపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు.

తొలి రెండు వారాల్లో 10 శాతం తగ్గుదల
అంతరిక్ష ప్రయాణం వ్యోమగాముల శరీరంపై కూడా ప్రభావం చూపుతుంది. అక్కడికి వెళ్లిన తొలి రెండు వారాల్లో సాధారణంగా శరీర ద్రవ్యరాశి దాదాపు 10 శాతం తగ్గుతుందని అనిల్‌ మీనన్‌ తెలిపారు. ఆ తర్వాత క్రమంగా తిరిగి పెరుగుతుందని వివరించారు. అయితే ఈ మార్పు ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుందని పేర్కొన్నారు. తాను గతంలో భూమికి తిరిగి వచ్చినప్పుడు రెండు కిలోల బరువు తగ్గినట్లు అనిల్‌ మీనన్‌ వెల్లడించారు.