బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేటీఆర్ ఒక క్రూరమైన వ్యక్తి అని, సొంత చెల్లెలు కవితను సైతం ఇంట్లో నుంచి బయటకు గెంటేశారని సీఎం ఆరోపించారు. మహిళా సాధికారత గురించి మాట్లాడే నైతిక అర్హత కేటీఆర్‌కు ఏమాత్రం లేదని ఆయన విమర్శించారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో స్వయం సహాయక సంఘాల (SHG) మహిళలతో నిర్వహించిన సమ్మేళనంలో పాల్గొన్న సందర్భంగా ముఖ్యమంత్రి ఈ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

కేటీఆర్ తీరుపై విమర్శలు గుప్పిస్తూ.. గడ్డం పెంచుకుని, వింత వేషధారణలతో కేటీఆర్ గ్రామాల్లో తిరుగుతున్నారని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఆయన చేసిన పనుల గురించి స్వయంగా ఆయన సోదరే వెల్లడించారని పేర్కొన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో మహిళల కోసం ఏం చేశారో ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

పేదరికాన్ని అధిగమించాలంటే మహిళలు తమ పిల్లలను, ముఖ్యంగా ఆడబిడ్డలను ఉన్నత చదువులు చదివించాలని పిలుపునిచ్చారు. 2034 నాటికి స్వయం సహాయక సంఘాల్లో ఒక కోటి మంది మహిళలను సభ్యులుగా చేర్చి, వారిని కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు. తన పదవీ కాలంలో కోటి మంది మహిళలు లక్షాధికారులు, కోటీశ్వరులుగా మారితే తన జీవితానికి నిజమైన సార్థకత చేకూరుతుందని రేవంత్ రెడ్డి భావోద్వేగంగా పేర్కొన్నారు. 

ఈ వేదికపై నుంచే ముఖ్యమంత్రి ‘చేయూత’ పథకం కింద కొత్తగా 4.5 లక్షల మంది లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీని ప్రారంభించారు. ఈ కొత్త పింఛన్లలో 3.5 లక్షల మంది ఒంటరి మహిళలు, వితంతువులు ఉన్నారని ఆయన వివరించారు. 

గత 34 నెలల్లో మహిళల కోసం రూ. 79,000 కోట్ల బ్యాంకు రుణాలను అనుసంధానించామని ముఖ్యమంత్రి వివరించారు. నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను మహిళల పేరిటే రిజిస్ట్రేషన్ చేస్తున్నామని, 200 యూనిట్ల ఉచిత గృహ విద్యుత్‌ను అందిస్తున్నామని చెప్పారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు కల్పించిన ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని రోజూ 37 లక్షల మంది వినియోగించుకుంటున్నారని, ఆర్టీసీకి ప్రభుత్వమే నేరుగా నిధులు సమకూరుస్తూ ఆ సంస్థను లాభాల బాట పట్టిస్తోందని వివరించారు.