రాకింగ్ స్టార్ యశ్ కథానాయకుడిగా తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్’లో కొన్ని సన్నివేశాలపై బాలీవుడ్ నటి కియారా అద్వానీ సోషల్ మీడియా వేదికగా విమర్శలను ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆమె భర్త, నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా ఆమెకు అండగా నిలిచారు.

దర్శకురాలు గీతు మోహన్‌దాస్ రూపొందించిన ఈ సినిమాలో కియారా ‘నాదియా’ అనే సర్కస్ కళాకారిణి పాత్రను పోషించారు. సినిమాలోని కొన్ని సన్నిహిత సన్నివేశాలను ఉద్దేశించి కొందరు నెటిజన్లు ఆమెపై ట్రోలింగ్‌ చేశారు. వివాహం తర్వాత ఇలాంటి పాత్రలు చేయడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పోస్టులు పెట్టారు.

ఈ ట్రోలింగ్‌పై సిద్ధార్థ్ మల్హోత్రా సానుకూలంగా స్పందిస్తూ భార్యకు మద్దతు పలికారట. ఈ విషయాన్ని కియారా స్వయంగా వెల్లడించారు. విమర్శలు చేసేవారికి ఇతరుల వ్యక్తిగత జీవితం తెలియదని... విమర్శలను పట్టించుకోవద్దని సిద్ధార్థ్ చెప్పారట. ఇలాంటి వ్యాఖ్యలను పట్టించుకుని మానసిక ప్రశాంతతను కోల్పోవద్దని సూచించారట.

మరోవైపు, తోటి నటి హుమా ఖురేషి కూడా ఈ వ్యవహారంపై స్పందిస్తూ, సినీ పరిశ్రమలో మహిళా నటుల పట్ల చూపే ద్వంద్వ ప్రమాణాలు సరికావని ట్రోలింగ్‌ను తీవ్రంగా ఖండించారు. వృత్తిపరమైన నటనను, వ్యక్తిగత జీవితాన్ని వేరుగా చూడాలని పలువురు సినీ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు.