నిజాయతీ, నిబద్ధత, అంకితభావంతో విధులు నిర్వహించాలని, తాము వచ్చిన సామాజిక, ఆర్థిక మూలాలను ఎన్నడూ విస్మరించవద్దని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కొత్తగా నియమితులైన డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ)లకు పిలుపునిచ్చారు. మంగళవారం హైదరాబాద్‌లోని ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో నిర్వహించిన ప్రొబేషనరీ డీఎస్పీల (2025 బ్యాచ్) వీడ్కోలు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

"మీ ప్రవర్తన, మీరు తీసుకునే నిర్ణయాలు ప్రభుత్వ పనితీరుపై, ప్రతిష్ఠపై నేరుగా ప్రభావం చూపుతాయి. కష్టాల్లో ఉన్నప్పుడు ప్రజలు తమ కుటుంబ సభ్యుల కంటే ముందుగా పోలీసులనే ఆశ్రయిస్తారు. గత తరం అధికారులు నెలకొల్పిన విశ్వసనీయతను మీరు కాపాడాలి" అని సీఎం సూచించారు.

మొత్తం 112 మంది డీఎస్పీల నియామక ప్రక్రియను తమ ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా పూర్తి చేసిందని రేవంత్ రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో గ్రూప్-1 నియామకాల్లో తలెత్తిన వివాదాలను పరిష్కరించి, టీజీపీఎస్సీని ప్రక్షాళన చేశామని పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకంపై ఆధారపడిన సామాన్య కుటుంబాల బిడ్డలు సైతం డీఎస్పీలుగా ఎంపిక కావడమే ప్రభుత్వ పారదర్శకతకు నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో డ్రగ్స్ వినియోగం, అక్రమ రవాణా పెను సవాలుగా పరిణమించాయని, దీనిని సమర్థవంతంగా అడ్డుకునేందుకు ప్రత్యేకంగా ‘ఈగిల్ ఫోర్స్’ను ఏర్పాటు చేసినట్లు సీఎం తెలిపారు. ఆధునిక పోలీసింగ్ పద్ధతుల్లో శిక్షణ కోసం అవసరమైతే కొత్త డీఎస్పీలను విదేశాలకు పంపేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన హామీ ఇచ్చారు.