దీపావళి వేళ ఉత్తరప్రదేశ్‌లో కాల్పుల ఘటన కలకలం రేపింది. రాష్ట్రపతి భవన్‌ భద్రతా విధుల్లో ఉన్న భారత సైనికుడిపై ఇద్దరు వ్యక్తులు కాల్పులకు తెగబడ్డారు. పాత కక్షల నేపథ్యంలో ఈ దాడి జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో జవాన్‌తో పాటు ఆయన సోదరుడు కూడా గాయపడ్డారు. ప్రస్తుతం జవాన్‌ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.

ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పట్‌ జిల్లా గోపాల్‌పూర్‌ ఖదానా గ్రామానికి చెందిన సౌరభ్‌ తోమర్‌ (26) 2021లో భారత సైన్యంలో చేరారు. ప్రస్తుతం రాష్ట్రపతి భవన్‌ భద్రతా విభాగమైన ప్రెసిడెంట్స్‌ బాడీగార్డ్‌ (పీబీజీ) రెజిమెంట్‌లో విధులు నిర్వహిస్తున్నారు. దీపావళి పండగ కోసం సెలవుపై స్వగ్రామానికి వచ్చారు. నవంబర్‌ 8న రాత్రి సోదరులు వినీత్‌, మింటూతో కలిసి ఇంటి బయట బాణసంచా కాలుస్తున్నారు. ఈ సమయంలో గ్రామానికి చెందిన ధీరజ్‌, అతడి సోదరుడు మోను అలియాస్‌ ప్రవీణ్‌తో వాగ్వాదం జరిగినట్లు సమాచారం.

వాగ్వాదం తీవ్రం కావడంతో నిందితుల్లో ఒకరు తుపాకీతో కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. బుల్లెట్‌ గోడకు తగిలి పక్కకు దూసుకెళ్లి సౌరభ్‌ చెవి వెనుక భాగంలో తగిలింది. మరోవైపు వినీత్‌పై కర్రతో దాడి చేయడంతో ఆయన తలకు తీవ్ర గాయాలయ్యాయి. సౌరభ్‌ను వెంటనే మీరట్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ శస్త్రచికిత్స నిర్వహించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉంది.

సౌరభ్‌ తండ్రి జనక్‌రాజ్‌ ఫిర్యాదుతో రమాలా పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. పరారీలో ఉన్న ధీరజ్‌, మోను కోసం పోలీసులు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. వారి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

ప్రెసిడెంట్స్‌ బాడీగార్డ్‌ భారత సైన్యంలో అత్యంత పురాతనమైన, సీనియర్‌ అశ్వక దళ రెజిమెంట్‌. న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతికి భద్రత కల్పించడం ఈ విభాగం ప్రధాన బాధ్యత.