సొంతింటి కల నెరవేరడంతో పేద కుటుంబాల ఇళ్లలో ఈ దీపావళి మరింత ఆనందాన్ని నింపింది. ఖమ్మం రూరల్‌ మండలం కామంచికల్‌ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో కలిసి రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి కుటుంబ సభ్యులతో ముచ్చటించారు. వారికి నూతన వస్త్రాలు అందజేసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. సొంతింటిలో పండుగ జరుపుకుంటున్న పేద కుటుంబాల ఆనందంలో భాగస్వాములయ్యారు.

ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్లు పేదల ఆత్మగౌరవానికి ప్రతీకలని అన్నారు. రాష్ట్రంలోని ప్రతి గూడెం, తండా, గ్రామ పంచాయతీ, వార్డు, డివిజన్‌లో లబ్ధిదారులు తమ సొంతింటిలో దీపావళి జరుపుకోవాలనే లక్ష్యంతో ప్రభుత్వం ‘మా ఇందిరమ్మ ఇంటిలో దీపావళి’ కార్యక్రమాన్ని చేపట్టిందని వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు కృషి చేస్తోందన్నారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి విడతల వారీగా ఇళ్లు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 8 లక్షల ఇళ్లను మంజూరు చేసినట్లు మంత్రి వెల్లడించారు. మొదటి విడతలో 4.5 లక్షలు, రెండో విడతలో 2.5 లక్షలు, హైదరాబాద్‌లో లక్ష ఇళ్లను కేటాయించినట్లు తెలిపారు. మొదటి విడతలో మంజూరైన ఇళ్లలో ఇప్పటివరకు 2,21,500 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని చెప్పారు. కులం, మతం, రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా అర్హులైన పేదలకు ఇళ్ల కేటాయింపులో ప్రాధాన్యం ఇచ్చామన్నారు. త్వరలో మూడు, నాలుగో విడతల్లోనూ ఇళ్లు మంజూరు చేస్తామని ప్రకటించారు.

పేద ఆడబిడ్డల సొంతింటి కల నెరవేర్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ.40 వేల కోట్ల నిధులు కేటాయించినట్లు పొంగులేటి తెలిపారు. అక్రమాలకు తావులేకుండా పారదర్శకంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. భవిష్యత్తులోనూ ఇళ్ల నిర్మాణ కార్యక్రమాన్ని కొనసాగించి పేదల ఆత్మగౌరవాన్ని కాపాడుతామని వెల్లడించారు.