రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్‌.. రబీ పంటల మద్దతు ధర పెంపు
Advertisement

రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్‌.. రబీ పంటల మద్దతు ధర పెంపు

Good news for farmers Central Government increases Rabi crops MSP
రబీ పంటల ఎంఎస్‌పీ పెంపునకు కేంద్రం ఆమోదం
కుసుమకు అత్యధికంగా రూ.675 పెంపు
ఆవాలకు రూ.413, గోధుమకు రూ.25 చొప్పున పెంపు
3,715 లక్షల టన్నులకు పెరిగిన గోధుమ సేకరణ 
ఆరు రబీ పంటలకు రూ.8.36 లక్షల కోట్ల మద్దతు ధర 
రైతుల ఆదాయం పెంచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2027-28 మార్కెటింగ్‌ సీజన్‌కు సంబంధించి అన్ని రబీ పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) పెంచేందుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ (సీసీఈఏ) సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

రబీ పంటల్లో కుసుమ మద్దతు ధరను అత్యధికంగా క్వింటాల్‌పై రూ.675 పెంచారు. ఆ తర్వాత ఆవాలకు రూ.413 పెంపు ప్రకటించారు. మసూర్‌ పప్పుకు రూ.390, బార్లీకి రూ.136, శనగకు రూ.83, గోధుమకు రూ.25 చొప్పున ఎంఎస్‌పీ పెంచారు.

రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించేలా ఈ పెంపు చేసినట్లు కేంద్రం తెలిపింది. ఉత్పత్తి వ్యయంపై కనీసం 1.5 రెట్ల స్థాయిలో ఎంఎస్‌పీ ఉండేలా చూడాలన్న 2018-19 కేంద్ర బడ్జెట్‌ ప్రకటనకు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.

ఇటీవలి కాలంలో తృణధాన్యాలతో పాటు పప్పులు, నూనెగింజల సాగును ప్రోత్సహించేందుకు కేంద్రం ఎక్కువ మద్దతు ధర అందిస్తోంది.

2014-15 నుంచి 2025-26 మధ్య గోధుమల సేకరణ 3,715 లక్షల టన్నులకు పెరిగింది. 2004-05 నుంచి 2013-14 మధ్య ఇది 2,254 లక్షల టన్నులుగా ఉంది. ఆరు రబీ పంటల సేకరణ కూడా ఇదే కాలంలో 3,921 లక్షల టన్నులకు చేరింది. గతంలో ఇది 2,302 లక్షల టన్నులుగా ఉండేది.

గోధుమ రైతులకు 2014-15 నుంచి 2025-26 మధ్య మద్దతు ధర రూపంలో రూ.7.31 లక్షల కోట్లు చెల్లించారు. 2004-05 నుంచి 2013-14 మధ్య చెల్లించిన రూ.2.56 లక్షల కోట్లతో పోలిస్తే ఇది ఎక్కువ. ఆరు రబీ పంటలు పండించే రైతులకు ఇదే కాలంలో రూ.8.36 లక్షల కోట్లు ఎంఎస్‌పీగా చెల్లించగా.. అంతకుముందు కాలంలో రూ.2.65 లక్షల కోట్లు చెల్లించారు.
Advertisement
Central Government
Rabi Crops MSP Hike
Narendra Modi
Minimum Support Price
Wheat MSP 2027
Farmer Income Boost

More Telugu News