అగర్బత్తీలు, మస్కిటో కాయిల్స్‌తో క్యాన్సర్ వస్తుందా?.. వాస్తవమెంత?

అగర్బత్తీలు, మస్కిటో కాయిల్స్‌తో క్యాన్సర్ వస్తుందా?.. వాస్తవమెంత?

Incense sticks and mosquito coils cancer risk facts and truth
  • ఇళ్లలో అగర్బత్తీలు, మస్కిటో కాయిల్స్ అప్పుడప్పుడు వాడితే క్యాన్సర్ రాదంటున్న నిపుణులు
  • క్యాన్సర్‌కు జన్యుపరమైన, జీవనశైలి వంటి అనేక అంశాలు కారణమవుతాయ‌ని వెల్ల‌డి
  • గాలి, వెలుతురు లేని గదుల్లో వీటిని వాడటం ఆరోగ్యానికి హానికరం
  • అగర్బత్తీల పొగలో కొన్ని హానికారక రసాయనాలు ఉంటాయని వెల్లడి
  • వీటి వాడకం తగ్గించుకుని, ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలని నిపుణుల సూచన
పూజ గదిలో వెలిగే అగర్బత్తీ సువాసన, దోమల నుంచి రక్షణ కోసం వాడే మస్కిటో కాయిల్ మన ఇళ్లలో సర్వసాధారణం. అయితే, వీటి నుంచి వెలువడే పొగ క్యాన్సర్‌కు కారణమవుతుందనే ఆందోళన చాలా మందిలో ఉంది. ఈ అపోహలు, వాస్తవాలపై వైద్య నిపుణులు స్పష్టతనిచ్చారు. ఎన్డీటీవీ కథనం ప్రకారం, అప్పుడప్పుడు పరిమితంగా ఇంట్లో అగర్బత్తీలు లేదా మస్కిటో కాయిల్స్ వాడటం వల్ల నేరుగా క్యాన్సర్ వచ్చే ప్రమాదం లేదని నిపుణులు తెలిపారు.

సాధారణ గృహ వినియోగంతో క్యాన్సర్ వస్తుందనడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని స్పష్టం చేశారు. క్యాన్సర్ అనేది కేవలం ఒక్క కారణంతో వచ్చేది కాదని, దీనికి జన్యుపరమైన అంశాలు, పొగాకు, మద్యం వినియోగం, అధిక బరువు, కొన్ని రకాల ఇన్‌ఫెక్షన్లు, ఇతర పర్యావరణ కారకాలు కూడా దోహదం చేస్తాయని వివరించారు. కేవలం అగర్బత్తీలు లేదా కాయిల్స్ వాడకమే క్యాన్సర్‌కు ప్రత్యక్ష కారణమని చెప్పలేమన్నారు.

అయితే, కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి అని నిపుణులు హెచ్చరించారు. ముఖ్యంగా గాలి, వెలుతురు సరిగా లేని మూసి ఉన్న గదుల్లో వీటిని కాల్చడం వల్ల గాలి నాణ్యత తీవ్రంగా దెబ్బతింటుంది. అగర్బత్తీలు, కాయిల్స్ కాలినప్పుడు వాటి పొగ నుంచి ఫైన్ పార్టిక్యులేట్ మ్యాటర్ (సూక్ష్మ ధూళి కణాలు), వోలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్, పాలీసైక్లిక్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్స్ వంటి హానికర రసాయనాలు గాలిలోకి విడుదలవుతాయి.

కొన్ని ప్రయోగశాల, ఎపిడెమియోలాజికల్ అధ్యయనాల ప్రకారం, ఎక్కువ కాలం పాటు అధిక మోతాదులో ఈ పొగను పీల్చేవారిలో కొన్ని రకాల శ్వాసకోశ క్యాన్సర్‌ల ముప్పు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. అయితే, ఇది కేవలం ఒక ముప్పునకు, పొగకు మధ్య ఉన్న సంబంధాన్ని మాత్రమే సూచిస్తుంది తప్ప, పొగ వలనే క్యాన్సర్ వస్తుందని నిరూపించలేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ అంశంపై మరింత పరిశోధన జరగాల్సి ఉందన్నారు.

నిపుణుల సూచనలు:
సాంస్కృతిక అలవాట్లను పాటిస్తూనే ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి నిపుణులు కొన్ని సూచనలు చేశారు.

  • అగర్బత్తీలను బాగా గాలి, వెలుతురు వచ్చే ప్రదేశాల్లో మాత్రమే వెలిగించాలి.
  • వాటిని వెలిగించే సమయాన్ని, సంఖ్యను పరిమితం చేయాలి.
  • మస్కిటో కాయిల్స్‌ను మూసి ఉన్న గదుల్లో, ముఖ్యంగా నిద్రపోయేటప్పుడు వాడటం మంచిది కాదు.
  • వీటికి ప్రత్యామ్నాయంగా దోమతెరలు లేదా ఎలక్ట్రిక్ రిపెల్లెంట్ల వంటివి వాడటం సురక్షితమైన మార్గం.
Advertisement
Incense sticks
Mosquito coils
Cancer risk
Health safety
Air pollution
Respiratory health

More Telugu News