అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో వైట్ హౌస్ కు సమీపంలో కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది. గురువారం ఉదయం నార్త్‌వెస్ట్ డీసీలోని లోగాన్ సర్కిల్ పరిసరాల్లో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో కనీసం ఐదుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే మెట్రోపాలిటన్ పోలీస్ విభాగం సంఘటనా స్థలానికి చేరుకుని భద్రతను కట్టుదిట్టం చేసింది.

ఈ ఘటన 15వ వీధి, పీ వీధి ఎన్‌డబ్ల్యూ కూడలి వద్ద ఉన్న వీడా ఫిట్‌నెస్ సెంటర్, సెయింట్ లూక్స్ ఎపిస్కోపల్ చర్చి సమీపంలో చోటుచేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్‌ను రంగంలోకి దించారు. వీరికి ఫెడరల్ ఏజెన్సీ ఏటీఎఫ్ (ATF) సహా ఇతర భద్రతా విభాగాలు సహాయం అందిస్తున్నాయి.

పరిస్థితి తీవ్రత దృష్ట్యా లోగాన్ సర్కిల్, డ్యుపాంట్ సర్కిల్ ప్రాంతాల్లోని ప్రజలు ఎవరూ బయటకు రావద్దని, ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని అధికారులు షెల్టర్-ఇన్-ప్లేస్ ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు కిటికీలకు దూరంగా ఉండాలని స్పష్టం చేశారు. ముందుజాగ్రత్త చర్యగా సమీపంలోని పాఠశాలలను లాక్‌డౌన్ చేయడంతో పాటు ప్రధాన రహదారులను పూర్తిగా మూసివేశారు.

స్థానిక కౌన్సిల్ సభ్యురాలు బ్రూక్ పింటో మాట్లాడుతూ.. విడా ఫిట్‌నెస్ లోపల, బయట కాల్పులు జరిగినట్లు వెల్లడించారు. జిమ్ లోపల ఉన్న ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. మొదట తుపాకీ శబ్దం వినిపించిందని, ఒక వ్యక్తి కింద పడిపోవడం గమనించామని చెప్పారు. ఆ వెంటనే మరికొన్ని రౌండ్ల కాల్పులు జరగడంతో ప్రజలు ప్రాణభయంతో చేతులు పైకెత్తి బయటకు పరుగులు తీశారని తెలిపారు.

నిందితుడు భారీ కాయం కలిగిన శ్వేతజాతీయుడని, బూడిద రంగు చొక్కా ధరించి ఉన్నాడని ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోంది. దుండగుడు ఏదైనా భవనంలో నక్కి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుని గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి.