శరీర ఆరోగ్యానికి విటమిన్లు చాలా అవసరమే అయినప్పటికీ, సరైన వైద్య కారణం లేకుండా మోతాదుకు మించి హై-డోస్ విటమిన్ సప్లిమెంట్లు వాడితే క్యాన్సర్ ముప్పు పెరిగే ప్రమాదం ఉందని పుణేకు చెందిన ప్రముఖ క్యాన్సర్ నిపుణురాలు డాక్టర్ అస్మా పఠాన్ హెచ్చరించారు. సహజసిద్ధమైన ఆహారం కాకుండా కృత్రిమంగా తీసుకునే సప్లిమెంట్లు శరీరంలో ప్రతికూల ప్రభావాలు చూపుతాయని ఆమె స్పష్టం చేశారు.

సాధారణంగా యాంటీఆక్సిడెంట్లను కణాల రక్షణకు ఉపయోగపడతాయని భావిస్తారు. అయితే, భారీ క్లినికల్ ట్రయల్స్ భిన్నమైన ఫలితాలను చూపించాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. ఫిన్‌లాండ్‌లో ధూమపానం చేసేవారిపై జరిపిన 'ఏటీబీసీ' పరిశోధనలో బీటా-కెరోటిన్ సప్లిమెంట్లు వాడిన వారిలో ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశం 18 శాతం పెరిగినట్లు తేలింది. 

అలాగే 'క్యారెట్' ట్రయల్‌లో బీటా-కెరోటిన్, విటమిన్-ఏ కలిపి వాడిన వారిలో లంగ్ క్యాన్సర్ రిస్క్ 28 శాతం పెరగడంతో ఆ అధ్యయనాన్ని మధ్యలోనే నిలిపివేశారు. క్యారెట్, గుమ్మడికాయ, ఆకుకూరల ద్వారా అందే బీటా-కెరోటిన్ పూర్తిగా సురక్షితమని, మాత్రల రూపంలో అధికంగా తీసుకున్నప్పుడే ఈ ప్రమాదం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.

మరోవైపు 'సెలెక్ట్' అధ్యయనం ప్రకారం, విటమిన్-ఈ సప్లిమెంట్లను ఎక్కువగా వాడిన పురుషుల్లో ప్రొస్టేట్ క్యాన్సర్ వచ్చే ముప్పు పెరిగినట్లు వెల్లడైంది. అందుకే క్యాన్సర్ నివారణ పేరుతో బీటా-కెరోటిన్ లేదా విటమిన్-ఈ సప్లిమెంట్లు వాడవద్దని అమెరికాకు చెందిన నిపుణుల కమిటీ సూచించింది. భారత్‌లో చాలామంది డాక్టర్ల సలహా లేకుండానే ఓవర్ ది కౌంటర్ మల్టీవిటమిన్లు, ఇమ్యూనిటీ బూస్టర్లను వాడుతుంటారు. కొవ్వులో కరిగే విటమిన్లు (ఏ, డి, ఈ, కే) శరీరంలో ఎక్కువైతే విషతుల్యంగా మారే అవకాశముందని ఐసీఎంఆర్-ఎన్ఐఎన్ 2024 మార్గదర్శకాలు సైతం హెచ్చరించాయి.

ముఖ్యంగా క్యాన్సర్ చికిత్స తీసుకునే రోగులు ఇటువంటి సప్లిమెంట్లను వాడితే కీమోథెరపీ, రేడియేషన్ ప్రభావం దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఏదైనా విటమిన్ లోపం ఉందని భావిస్తే రక్త పరీక్షలు చేయించుకుని, వైద్యుల పర్యవేక్షణలోనే మందులు వాడాలని, ఆహారం ద్వారానే పోషకాలు పొందడం అన్నివిధాలా శ్రేయస్కరమని నిపుణులు సూచిస్తున్నారు.