కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం (NSCBI) రన్‌వేపైకి గురువారం అకస్మాత్తుగా ఓ వీధి కుక్క రావడంతో భారీ విమాన ప్రమాదం తప్పింది. పైలట్ సమయస్ఫూర్తి, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) తీసుకున్న తక్షణ నిర్ణయంతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.

విమానాశ్రయ అధికారుల వివరాల ప్రకారం.. కోల్‌కతా నుంచి రాంచీ వెళ్లాల్సిన ఇండిగో విమానం రన్‌వేపై టేకాఫ్‌కు సిద్ధమవుతోంది. విమానం రన్‌వేపైకి చేరుకుని, టేకాఫ్ కావడానికి కొద్ది క్షణాల ముందు రన్‌వేపై ఓ వీధి కుక్క తిరుగుతుండటాన్ని పైలట్ గమనించారు. ప్రమాదం జరిగే అవకాశం ఉందని గుర్తించిన పైలట్ వెంటనే కోల్‌కతా ఏటీసీ అధికారులను అప్రమత్తం చేశారు.

సరిగ్గా అదే సమయానికి చెన్నై నుంచి కోల్‌కతాకు వస్తున్న మరో ఇండిగో విమానం ల్యాండ్ కావాల్సి ఉంది. రన్‌వేపై కుక్క ఉందన్న సమాచారం అందిన వెంటనే ఏటీసీ అప్రమత్తమైంది. ప్రమాద భయంతో ఆ విమానాన్ని కోల్‌కతాలో ల్యాండింగ్ చేయడానికి నిరాకరించిన అధికారులు, ప్రత్యామ్నాయ విమానాశ్రయానికి వెళ్లాల్సిందిగా సూచించారు. ఏటీసీ ఆదేశాల మేరకు చెన్నై విమానాన్ని కోల్‌కతాకు దాదాపు 187 కిలోమీటర్ల దూరంలో ఉన్న పశ్చిమ బర్ధమాన్ జిల్లాలోని అండాల్ విమానాశ్రయానికి మళ్లించడంతో అది సురక్షితంగా ల్యాండ్ అయింది.

ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడటంతో ఊపిరి పీల్చుకున్నప్పటికీ, ఈ ఘటన కోల్‌కతా ఎయిర్‌పోర్ట్ భద్రతపై అనుమానాలకు తావిస్తోంది. అత్యంత సురక్షిత ప్రాంతమైన రన్‌వేపైకి కుక్క ఎవరి కంటా పడకుండా ఎలా ప్రవేశించిందనే అంశంపై విమానాశ్రయ అధికారులు విచారణ ప్రారంభించారు.

మరోవైపు, అంతకుముందు బుధవారం ఉదయం ఇదే ఎయిర్‌పోర్టులో ఎయిర్ ఇండియా విమానానికి హైజాక్ బెదిరింపు వచ్చిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనపై విచారణ జరిపిన పోలీసులు ఉత్తర 24 పరగణాల జిల్లాలోని సోదెపూర్‌కు చెందిన ఒక ప్రయాణికుడిని అరెస్ట్ చేశారు. సదరు వ్యక్తిని అతని కార్యాలయం ఇష్టం లేకుండా ఆఫ్రికా దేశానికి పంపుతోందని, క్యాన్సర్‌తో బాధపడుతున్న భార్యను వదిలి వెళ్లడం ఇష్టం లేకే ఆ విదేశీ ప్రయాణాన్ని రద్దు చేసుకునేందుకు హైజాక్ డ్రామా ఆడినట్లు తేలింది. చివరకు ఆ ప్రయాణికుడు కటకటాలపాలయ్యాడు.