మల్లారెడ్డి విద్యాసంస్థల వైస్ చైర్మన్, మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నేరెళ్ల శారదను కలిశారు. విద్యాసంస్థల ప్రాంగణాల్లో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో మహిళా కమిషన్ లేవనెత్తిన సందేహాలు, ప్రశ్నలకు వివరణ ఇచ్చేందుకు ఆమె కమిషన్ కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా కమిషన్ అడిగిన పలు అంశాలపై ఆమె సుదీర్ఘంగా సమాధానాలు ఇచ్చారు.

భేటీ అనంతరం ప్రీతిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. విద్యాసంస్థల వైస్ చైర్మన్ హోదాలో కమిషన్ అడిగిన అన్ని ప్రశ్నలకూ పూర్తిస్థాయిలో వివరణ ఇచ్చినట్లు తెలిపారు. కాలేజీలలో సినీ ఈవెంట్ల నిర్వహణపై వస్తున్న వార్తలపై ఆమె స్పష్టతనిచ్చారు. 365 రోజుల్లో తమకు చెందిన 3 వేర్వేరు క్యాంపస్‌లలో కేవలం 3 ఈవెంట్లను మాత్రమే నిర్వహించామని చెప్పారు. ఈ కార్యక్రమాల వల్ల విద్యార్థుల రోజువారీ తరగతులకు ఎలాంటి భంగం కలగలేదని ఆమె స్పష్టం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం, అలాగే ఇటీవల ఉన్నత విద్యామండలి జారీ చేసిన అన్ని రకాల మార్గదర్శకాలను, ఆదేశాలను తమ విద్యాసంస్థలు తు.చ. తప్పకుండా పాటిస్తాయని ప్రీతిరెడ్డి వెల్లడించారు. కాలేజీల్లో వేడుకలు లేదా కార్యక్రమాలు జరిగినప్పుడు యాజమాన్యం మాత్రమే కాకుండా, విద్యార్థులు కూడా తగినంత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. విద్యార్థుల భద్రత, వారి భవిష్యత్తుకు తమ విద్యాసంస్థలు ఎల్లప్పుడూ అత్యధిక ప్రాధాన్యత ఇస్తాయని ఆమె పేర్కొన్నారు.