నవంబర్ 14న ప్రపంచ మధుమేహ దినోత్సవం (వరల్డ్ డయాబెటిస్ డే) పురస్కరించుకుని విడుదలైన ఓ అంతర్జాతీయ సర్వేలో అత్యంత ఆందోళనకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. భారతదేశంలో సుమారు 3.86 కోట్ల మంది పెద్దలు డయాబెటిస్‌తో జీవిస్తున్నప్పటికీ, ఆ విషయం వారికి ఏమాత్రం తెలియదని ఈ అధ్యయనం వెల్లడించింది. దేశంలోని మొత్తం మధుమేహ బాధితుల్లో ఏకంగా 43 శాతం మంది ఇప్పటివరకు ఎలాంటి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోలేదు. దీనివల్ల ప్రస్తుతం దేశంలో డయాబెటిస్ నిర్ధారణ రేటు కేవలం 57 శాతంగానే నమోదవుతూ, ప్రపంచ లక్ష్యాల కంటే చాలా వెనుకబడి ఉంది. భారత్‌తో పాటు మరో ఆరు దేశాల్లో నిర్వహించిన ఈ అధ్యయనం, ప్రజల్లో ఉన్న అవగాహనకు మరియు వాస్తవ ఆచరణకు మధ్య ఉన్న భారీ వ్యత్యాసాన్ని స్పష్టంగా ఎత్తిచూపింది.

భారత్‌లో 502 మందిపై నిర్వహించిన ఈ సర్వే ప్రకారం.. ప్రజల్లో మధుమేహంపై సాధారణ అవగాహన ఉన్నప్పటికీ, వ్యక్తిగతంగా తమకు ఆ ముప్పు పొంచి ఉందనే స్పృహ చాలా తక్కువగా ఉంది. సర్వేలో పాల్గొన్న వారిలో 84 శాతం మంది ఆరోగ్యంగా ఉన్నప్పటికీ ముందస్తు డయాబెటిస్ పరీక్షలు చేయించుకోవడం మంచిదేనని అంగీకరించారు. అయితే, ఆశ్చర్యకరంగా కేవలం 14 శాతం మంది మాత్రమే వ్యక్తిగతంగా తమకు టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశం ఉందని భావించారు. సర్వేలో పాల్గొన్న దాదాపు ప్రతి ఒక్కరికీ కనీసం రెండు రిస్క్ ఫ్యాక్టర్లు ఉన్నప్పటికీ, తమకేమీ కాదనే భావనలో ఉండటం నిపుణులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

మరోవైపు ప్రీ-డయాబెటిస్ విషయంలోనూ ప్రజల్లో తీవ్రమైన అపోహలు నెలకొన్నాయి. రక్తంలో చక్కెర స్థాయిలు సాధారణం కంటే ఎక్కువగా ఉండి, పూర్తి డయాబెటిస్ స్థాయికి చేరని ఈ దశలో స్పష్టమైన లక్షణాలు కనిపిస్తాయని 75 శాతం మంది తప్పుగా నమ్ముతున్నారు. సర్వే జరిగిన ఆరు దేశాల్లో భారత్‌లోనే ఈ విధమైన తప్పుడు అవగాహన అత్యధికంగా నమోదైంది. దీనికితోడు, సొంతంగా ముందస్తు పరీక్షలు ఎలా ప్లాన్ చేసుకోవాలో తెలియక దాదాపు 48 శాతం మంది వెనుకంజ వేస్తున్నట్లు సర్వే తెలిపింది. జబ్బు గురించిన భయం, పరీక్షలు చేయించుకునే మార్గాలపై సరైన సమాచారం లేకపోవడం ప్రధాన అడ్డంకులుగా మారుతున్నాయి.

టైప్ 2 డయాబెటిస్ అనేది శరీరంలో ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా నిశ్శబ్దంగా విస్తరించే సమస్య. రక్తంలో చక్కెర స్థాయిలు నెలలు లేదా ఏళ్ల తరబడి ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రారంభ దశలో ఎలాంటి స్పష్టమైన లక్షణాలు బయటపడవు. స్వల్ప అలసట లేదా చూపు మందగించడం వంటి సూచనలు కనిపించినా.. చాలామంది వాటిని పని ఒత్తిడి లేదా స్క్రీన్ టైమ్ సమస్యలుగా భావించి నిర్లక్ష్యం చేస్తుంటారు. తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తే వరకు అసలు విషయం బయటపడటం లేదు.

విపరీతమైన దాహం, తరచూ మూత్రవిసర్జన వంటి సాంప్రదాయ లక్షణాలు కనిపించే వరకు వేచి చూస్తే చికిత్స మరింత ఆలస్యమవుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కుటుంబంలో ఎవరికైనా షుగర్ వ్యాధి ఉండటం, శారీరక శ్రమ లోపించడం, ఊబకాయం, అధిక రక్తపోటు (బీపీ) వంటి లక్షణాలు ఉన్నవారు తప్పనిసరిగా వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. కేవలం వ్యాధి గురించి తెలుసుకోవడమే కాకుండా, ప్రతి ఒక్కరూ తమ వ్యక్తిగత ముప్పును గుర్తించి, క్రమం తప్పకుండా ముందస్తు స్క్రీనింగ్ చేయించుకోవడమే దీర్ఘకాలిక ఆరోగ్యానికి సరైన మార్గమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.