ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) చిప్ తయారీ దిగ్గజ సంస్థ ఎన్విడియా (Nvidia) నూతన సీఈవోగా యాపిల్ మాజీ చీఫ్ టిమ్ కుక్ బాధ్యతలు చేపట్టాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించారు. ఎన్విడియా వ్యవస్థాపకుడు, సీఈఓ జెన్సన్ హువాంగ్ తన పదవికి ఆకస్మికంగా రాజీనామా చేసిన నేపథ్యంలో ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయ టెక్ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

తన అధికారిక సోషల్ మీడియా వేదిక ‘ట్రూత్ సోషల్’ ద్వారా ట్రంప్ ఈ ప్రతిపాదన చేశారు. జెన్సన్ హువాంగ్ ఎన్విడియాను అగ్రగామిగా తీర్చిదిద్దిన తీరును ప్రశంసించిన ట్రంప్.. "ఒక లెజెండ్ స్థానాన్ని మరో లెజెండ్ మాత్రమే భర్తీ చేయగలడు" అని పేర్కొన్నారు. ఆ స్థానానికి టిమ్ కుక్ సరైన వ్యక్తి అని ట్రంప్ అభిప్రాయపడ్డారు.

వివాహేతర సంబంధాల ఆరోపణలు రావడంతో జెన్సన్ హువాంగ్ నేడు తక్షణమే అమల్లోకి వచ్చేలా ఎన్విడియా ప్రెసిడెంట్, సీఈవో అలాగే డైరెక్టర్ల బోర్డు సభ్యత్వానికి రాజీనామా చేశారు. చైనా ఇంటెలిజెన్స్‌తో సంబంధాలు ఉన్నట్లు అమెరికా నిఘా వర్గాలు అనుమానిస్తున్న మెగాస్పీడ్ మాజీ ఎగ్జిక్యూటివ్, చైనా వ్యాపారవేత్త ఆలిస్ హువాంగ్ (హువాంగ్ లే)తో వివాహేతర సంబంధం నెరిపినట్లు వచ్చిన ఆరోపణలు వివాదాస్పదమయ్యాయి. దీనిపై ఎన్విడియా స్వతంత్ర దర్యాప్తు ప్రారంభించగా, హువాంగ్ తన తప్పును అంగీకరిస్తూ క్షమాపణలు చెప్పారు. అయితే సంస్థ రహస్యాలు గానీ, అమెరికా జాతీయ భద్రత గానీ ప్రమాదంలో పడలేదని ఎన్విడియా స్పష్టం చేసింది. ఆమె గూఢచారి అనే విషయం తనకు తెలియదన్న హువాంగ్ వివరణను తాను నమ్ముతున్నట్లు ట్రంప్ గతంలోనే పేర్కొన్నారు.

హువాంగ్ రాజీనామా అనంతరం ఎన్విడియా యాజమాన్యం తదుపరి చర్యలను వేగవంతం చేసింది. సంస్థలో సుదీర్ఘకాలంగా చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (CFO)గా సేవలందిస్తున్న కొలెట్ క్రెస్‌ను తాత్కాలిక సీఈవోగా నియమించింది. శాశ్వత సీఈవో ఎంపిక కోసం సంస్థ అంతర్గతంగా ఉన్నవారితో పాటు బయటి వ్యక్తులను కూడా పరిశీలిస్తోంది.

మరోవైపు టిమ్ కుక్ సుమారు 15 ఏళ్ల పాటు యాపిల్ సీఈవోగా పనిచేసి ఈ ఏడాది సెప్టెంబర్ లో ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. అనంతరం జాన్ టెర్నస్ యాపిల్ సీఈవోగా బాధ్యతలు స్వీకరించగా, కుక్ ప్రస్తుతం కంపెనీ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.