ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి అడుగుపెట్టిందని చాలామంది సంబరపడతారు. పంజాబ్‌కు చెందిన ఓ సామాన్య కుటుంబంలో ఇది అక్షరాలా నిజమైంది. చిన్నారి పుట్టిన కేవలం 24 గంటల్లోనే ఆ తండ్రిని అదృష్టం వరించింది. ఏకంగా రూ. 1.5 కోట్ల బంపర్ లాటరీ రూపంలో సిరుల పంట పండింది. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆ కుటుంబాన్ని చిన్నారి జననం క్షణాల్లో కోటీశ్వరులను చేసింది.

పంజాబ్‌లోని మాన్సా జిల్లా బరేటా పట్టణానికి చెందిన 24 ఏళ్ల యుధ్‌వీర్ సింగ్ వడ్రంగి (కార్పెంటర్) పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కుటుంబ పోషణతో పాటు ఇంటి నిర్మాణం కోసం చేసిన అప్పుల భారం అతడిపై తీవ్రంగా ఉంది. ఈ క్రమంలో నవంబర్ 4న తన గర్భిణి భార్య హర్మన్ కౌర్‌ను సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ఆ సమయంలో దారిలో కనిపించిన ‘పంజాబ్ స్టేట్ డియర్ 200 మంత్లీ లాటరీ’ టికెట్‌ను రూ. 200 వెచ్చించి కొనుగోలు చేశాడు. ఆర్థిక సమస్యల దృష్ట్యా లాటరీ టికెట్ వద్దని భార్య వారించినప్పటికీ, యుధ్‌వీర్ ఆమె పేరు మీదే జీవితంలో మొదటిసారి ఆ టికెట్ తీసుకున్నాడు.

అనంతరం నవంబర్ 6న హర్మన్ కౌర్ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆ ఆనందంలో కుటుంబం మునిగితేలుతుండగానే, మరుసటి రోజే అంటే నవంబర్ 7న లాటరీ ఫలితాలు వెలువడ్డాయి. యుధ్‌వీర్ కొన్న టికెట్‌కు మొదటి బహుమతిగా రూ. 1.5 కోట్లు వచ్చినట్లు నిర్వాహకులు ప్రకటించారు. చిన్నారి పుట్టిన 24 గంటలు గడవకముందే ఇంతటి భారీ మొత్తం వరించడంతో ఆ కుటుంబం ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తమ ఇంటికి వచ్చిన మహాలక్ష్మే ఈ అదృష్టాన్ని మోసుకొచ్చిందని భావించిన తల్లిదండ్రులు.. పాపకు ‘బర్కత్’ (అంటే ఆశీర్వాదం లేదా సంపద) అని పేరు పెట్టారు.

ఈ అదృష్టంపై యుధ్‌వీర్ సింగ్ మాట్లాడుతూ.. తాము తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సమయంలో దేవుడు తమ బిడ్డ రూపంలో ఈ సాయం అందించాడని భావోద్వేగానికి గురయ్యాడు. లాటరీ ద్వారా వచ్చిన ప్రైజ్ మనీతో ముందుగా ఇంటి కోసం చేసిన అప్పులన్నీ తీర్చేస్తానని తెలిపాడు. మిగిలిన మొత్తాన్ని కుమార్తె ‘బర్కత్’ ఉన్నత చదువుల కోసం, ఆమె ఉజ్వల భవిష్యత్తు కోసం ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తానని వివరించాడు.

ప్రస్తుతం ఈ విషయం స్థానికంగానే కాకుండా నెట్టింట కూడా వైరల్‌గా మారింది.