గాలిలో విషపూరిత ధూళి కణాలు.. నిత్యం వాటినే పీలుస్తూ జీవనం. బయటకు వెళ్లకుండా ఉండలేం.. కాలుష్యాన్ని పూర్తిగా నియంత్రించలేం. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎలా? మనం తీసుకునే ఆహారంతోనూ కాలుష్య ప్రభావాన్ని కొంతమేర తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కొన్ని విటమిన్లు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు శరీర కణాలను దెబ్బతినకుండా కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి. అయితే ఆహారం ఒక్కటే కాలుష్యం నుంచి పూర్తి రక్షణ ఇవ్వలేదని గుర్తుంచుకోవాలి.

ఒమేగా-3 ఉండే ఆహారం
కాలుష్యం గుండె ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఈ ముప్పును కొంతవరకు తగ్గించడంలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఉపయోగపడవచ్చని అధ్యయనాలు సూచిస్తున్నాయి. సాల్మన్‌, ట్యూనా వంటి చేపలు, ఇతర సీ ఫుడ్‌లో ఇవి పుష్కలంగా ఉంటాయి. కాలుష్యం ఎక్కువగా ఉన్న సమయంలో వీటిని ఆహారంలో చేర్చుకోవడం ప్రయోజనకరం.

విటమిన్లు ‘సి’, ‘డి’, ‘ఈ’తో మేలు
విటమిన్‌ సి శరీర రోగనిరోధక శక్తిని పెంచడంతోపాటు కణాలను ఆక్సీకరణ ఒత్తిడి నుంచి కాపాడుతుంది. ఉసిరి, నారింజ, నిమ్మకాయల్లో ఇది సమృద్ధిగా లభిస్తుంది. విటమిన్‌ డి, ఇ కూడా శరీర ఆరోగ్యానికి కీలకం. బాదం, వాల్‌నట్స్‌, ఆలివ్‌లు, ఆకుకూరలు విటమిన్‌ ఇ అందిస్తాయి. పాలు, వెన్న, గుడ్డు పచ్చసొన వంటి ఆహారాలు కాల్షియం అందిస్తాయి. ఇది సీసం వంటి భారలోహాల శోషణను తగ్గించడంలో తోడ్పడవచ్చు.

నూనె పదార్థాలు, ప్రాసెస్డ్‌ ఫుడ్‌కు దూరం
కాలుష్యం ఎక్కువగా ఉన్న సమయంలో శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌ సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో నూనెలో వేయించిన పదార్థాలు, ప్రాసెస్డ్‌ ఆహారాలు తీసుకోవడం మరింత ఇబ్బంది కలిగించవచ్చు. వీటికి బదులుగా ఇంట్లో తయారు చేసిన పరిశుభ్రమైన, పోషకాలు సమృద్ధిగా ఉండే ఆహారం తీసుకోవాలి.

హెర్బల్‌ టీతోనూ ప్రయోజనం
హెర్బల్‌ టీలు రోగనిరోధక శక్తికి తోడ్పడతాయని హార్వర్డ్‌ హెల్త్‌ ప్రస్తావించిన అధ్యయనం సూచిస్తోంది. అయితే వీటిని కాలుష్య ప్రభావాన్ని తొలగించే డిటాక్స్‌ పానీయాలుగా భావించకూడదు.

ఆహారంతోపాటు జాగ్రత్తలూ అవసరం
సమతుల ఆహారంతోపాటు తగినంత నిద్ర, రోజువారీ వ్యాయామం కూడా అవసరం. కాలుష్యం ఎక్కువగా ఉన్నప్పుడు బయట వ్యాయామానికి దూరంగా ఉండాలి. తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సి వస్తే మాస్కులు ధరించాలి. ఇంట్లో ఎయిర్‌ ప్యూరిఫయర్లు వాడటం, కాలుష్యం ఎక్కువగా ఉండే ప్రాంతాలకు దూరంగా ఉండటం మంచిది. ఈ జాగ్రత్తలన్నీ పాటించినప్పుడే కాలుష్య ముప్పును కొంతవరకు తగ్గించుకోవచ్చు.