ఉదయం నిద్రలేచిన వెంటనే పనుల్లో పడిపోతున్నారా? తీరిక లేదని టిఫిన్‌ను వాయిదా వేస్తున్నారా? చివరకు మధ్యాహ్నం సమయంలోనే మొదటి భోజనం చేస్తున్నారా? అయితే మీ ఆహారపు అలవాట్లపై ఓసారి దృష్టి పెట్టాల్సిందే. ఎందుకంటే ఉదయం అల్పాహారం తీసుకునే సమయం కూడా ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా మధ్యాహ్నం 12 గంటలు దాటిన తర్వాత బ్రేక్‌ఫాస్ట్‌ చేయడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఉదయం అల్పాహారం ఎందుకు ముఖ్యం?
రాత్రంతా ఆహారం తీసుకోకుండా నిద్రపోయిన తర్వాత శరీరానికి తిరిగి శక్తి అందించేది ఉదయం అల్పాహారమే. ఇది రోజువారీ జీవక్రియలు సక్రమంగా సాగేందుకు తోడ్పడుతుంది. మెదడు చురుగ్గా పనిచేయడానికి అవసరమైన శక్తి, పోషకాలు అందిస్తుంది. అందుకే నిద్రలేచిన రెండు గంటల్లోపు అల్పాహారం తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

జీవక్రియలపై ప్రభావం
ఉదయం అల్పాహారం తీసుకోవడంలో ఎక్కువ ఆలస్యం చేస్తే శరీర జీవగడియారం దెబ్బతినే అవకాశం ఉంది. దీనివల్ల జీవక్రియల పనితీరుపై ప్రభావం పడుతుంది. ఆలస్యంగా భోజనం చేసే అలవాటు ఇన్సులిన్‌ నిరోధకతను పెంచవచ్చని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఇది మధుమేహానికి దారితీసే ప్రమాద కారకాల్లో ఒకటి.

ఆకలి సంకేతాల్లో మార్పులు
రోజూ వేర్వేరు సమయాల్లో భోజనం చేయడం వల్ల శరీరంలో ఆకలి, కడుపు నిండిన భావనకు సంబంధించిన సంకేతాలు గందరగోళానికి గురవుతాయి. దీంతో ఎప్పుడు తినాలి? ఎంత తినాలి? అనే విషయంలో నియంత్రణ తగ్గవచ్చు. బరువు తగ్గాలనుకునే వారికి ఇది మరింత ఇబ్బందికరంగా మారుతుంది. 

బరువు పెరిగే ప్రమాదం
ఉదయం టిఫిన్‌ చేయకుండా ఉంటే మధ్యాహ్నం సమయానికి ఆకలి ఎక్కువవుతుంది. దీంతో అవసరానికి మించి ఆహారం తీసుకునే అవకాశం ఉంది. మధ్యలో చిరుతిళ్లు తినడం కూడా పెరుగుతుంది. ఫలితంగా శరీరంలోకి చేరే కేలరీలు అధికమై బరువు పెరిగే ప్రమాదం ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయుల్లో హెచ్చుతగ్గులు ఏర్పడి నీరసం కూడా రావచ్చు.

అల్పాహారం ఎలా ఉండాలి?
నిద్రలేచిన రెండు గంటల్లోపు అల్పాహారం తీసుకోవడం మంచిది. అందులో ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, పీచు పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. ఇవి రక్తంలో చక్కెర స్థాయులు స్థిరంగా ఉండటానికి, మధ్యాహ్న భోజనం వరకు శక్తి నిలకడగా ఉండటానికి తోడ్పడతాయి. అయితే ప్రతి ఒక్కరి నిద్ర సమయం, ఆరోగ్య పరిస్థితి, ఆహారపు అవసరాలు వేర్వేరుగా ఉంటాయి. అందుకే ఒకే సమయాన్ని అందరికీ వర్తింపజేయలేం. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారు వైద్యుల సూచనల ప్రకారం ఆహార సమయాలను పాటించాలి.