Golla Venkateswara Rao: సినిమా ఫక్కీలో మోసం: బంగారం విడిపిస్తామని వచ్చిన కంపెనీకే రూ.10 లక్షల టోకరా!

Hyderabad Man Cheats Gold Trading Company of Rupees 10 Lakhs
షార్ట్స్‌లో చూడండి
బంగారం విడిపించి ఇస్తామంటూ ప్రకటనలు ఇచ్చే ఓ గోల్డ్ ట్రేడింగ్ కంపెనీకే ఒక వ్యక్తి సినిమా లెవల్లో షాకిచ్చాడు. నమ్మబలికి తన ఖాతాలో ఏకంగా రూ.10.50 లక్షలు వేయించుకుని, కళ్లుగప్పి పరారైన నిందితుడిని ఎస్ఆర్ నగర్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు.

ఏపీలోని కృష్ణా జిల్లాకు చెందిన గొల్ల వెంకటేశ్వరరావు (34) అనే సివిల్ కాంట్రాక్టర్ మోతీనగర్‌లో నివసిస్తున్నాడు. ఫేస్‌బుక్‌లో ఒక గోల్డ్ ట్రేడింగ్ కంపెనీ యాడ్ చూసిన అతడు.. తాను ఐఐఎఫ్ఎల్‌‌లో తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించాలని వారిని కోరాడు. కంపెనీ ప్రతినిధులు విచారించగా వడ్డీతో కలిపి సుమారు రూ.10.50 లక్షలు చెల్లించాలని తేలింది. ఈ మొత్తాన్ని కంపెనీ వారు వెంకటేశ్వరరావు ఖాతాలోకి బదిలీ చేశారు. ప్రతిగా సెక్యూరిటీ చెక్కులు ఇవ్వాలని కోరగా, ప్రస్తుతం తన వద్ద ఒకటే ఉందని, మిగతావి ఇంటి దగ్గర ఇస్తానని నమ్మించాడు.

కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ను తన బైక్‌పై ఎక్కించుకుని ఈఎస్‌ఐ ఆసుపత్రి వెనుక ఉన్న ఒక అపార్ట్‌మెంట్‌ వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ అతడిని బయటే ఉండమని చెప్పి లోపలికి వెళ్లిన వెంకటేశ్వరరావు ఫోన్ స్విచ్చాఫ్ చేసి వెనుక గేట్ నుంచి మెల్లగా జారుకున్నాడు. వెంటనే బ్యాంకుకు వెళ్లి ఆ నగదును డ్రా చేసుకున్నాడు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసరెడ్డి బృందం, నిందితుడిని గాలించి పట్టుకుంది. అతడి వద్ద నుంచి రూ.10.50 లక్షల నగదును స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. 
Go Back to Shorts
Golla Venkateswara Rao
Gold Trading Company
IIFL
Gold Loan
Fraud
SR Nagar Police
Hyderabad Crime
Krishna District
Financial Crime
Cheating

More Telugu News