తిరుపతిలోని అలిపిరి–ఎస్వీ జూ పార్క్ రోడ్డులోని స్థలంలో అత్యాధునిక సదుపాయాలతో పిలిగ్రిమ్ టౌన్‌షిప్ నిర్మించాలని టీటీడీ నిర్ణయించింది. శ్రీవాణి ట్రస్ట్ నిధుల నుంచి రూ.2,750 కోట్ల అంచనా వ్యయంతో దీనిని చేపట్టనున్నారు. తిరుపతికి వచ్చే భక్తులకు ఒకేచోట మెరుగైన వసతి, ఆధునిక సదుపాయాలు కల్పించడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. ఈ ప్రాజెక్టు డీపీఆర్ (డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్), డిజైన్లు, పనుల పర్యవేక్షణ కోసం అనుభవజ్ఞులైన కన్సల్టెన్సీని నియమించేందుకు బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ప్రణాళికా దశలోనే ఉంది.

డిసెంబర్ 20 నుంచి వైకుంఠ ద్వార దర్శనాలు
ఈ ఏడాది డిసెంబర్ 20 నుంచి 29 వరకు మొత్తం 10 రోజుల పాటు తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించనున్నారు. ఈ పది రోజుల్లో సుమారు 8.34 లక్షల మంది భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. గత ఏడాదితో పోలిస్తే దాదాపు 51 వేల మందికి అదనంగా దర్శన భాగ్యం కల్పించనుండటం విశేషం. మొత్తం దర్శన సమయంలో 92 శాతం సమయాన్ని సాధారణ భక్తులకే కేటాయించాలని నిర్ణయించారు.

మొదటి రెండు రోజులైన వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల్లో ఉచిత సర్వదర్శనం ఉండదు. కేవలం ఆన్‌లైన్ ద్వారా జారీ చేసే ఎస్ఎస్‌డీ (SSD) టోకెన్లు ఉన్న భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు. మిగిలిన ఎనిమిది రోజులు సర్వదర్శనం యథావిధిగా కొనసాగుతుంది. అయితే ఈ ఎస్ఎస్‌డీ టోకెన్లను ఆన్‌లైన్‌లో ఎప్పుడు విడుదల చేస్తారనే తేదీని టీటీడీ ఇంకా ప్రకటించలేదు.

టీటీడీ మరికొన్ని కీలక నిర్ణయాలు:
గో సంరక్షణ: ఆలయంలో నిత్య కైంకర్యాలు, శ్రీవారి ప్రసాదాల తయారీకి అవసరమైన స్వచ్ఛమైన పాలు, నెయ్యిని స్థానికంగానే ఉత్పత్తి చేసేందుకు రూ.7.5 కోట్ల వ్యయంతో 500 దేశీయ ఆవులను కొనుగోలు చేయనున్నారు.
పర్యావరణం, పారిశుద్ధ్యం: తిరుమల క్షేత్రాన్ని నెట్-జీరోగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేకంగా పర్యావరణ విభాగాన్ని ఏర్పాటు చేయనున్నారు. అలాగే పారిశుద్ధ్య నిర్వహణ కోసం అదనంగా 348 మంది సిబ్బందిని నియమించనున్నారు.
అటవీ పరిరక్షణ: శేషాచలం అటవీ ప్రాంత సంరక్షణ కోసం అటవీశాఖకు రెండేళ్ల కాలానికి రూ.16.4 కోట్లు విడుదల చేయడానికి ఆమోదం తెలిపారు.
విద్య, వైద్య రంగాలు: స్విమ్స్ ఆసుపత్రి అభివృద్ధికి అదనంగా రూ.41.23 కోట్లు మంజూరు చేశారు. ఆయుర్వేద కళాశాలలో అదనంగా 20 బీఏఎంఎస్ సీట్లను పెంచనున్నారు. అలిపిరి సమీపంలోని శిల్పకళా కళాశాలలో 229 మంది విద్యార్థుల వసతి కోసం రూ.23 కోట్లతో నూతన హాస్టల్ భవనాన్ని నిర్మించనున్నారు.
కేబుల్ బ్రిడ్జి అధ్యయనం: అలిపిరి కాలినడక మార్గంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నుంచి మోకాళ్లమిట్ట వైపు కేబుల్ బ్రిడ్జి నిర్మాణ సాధ్యాసాధ్యాలపై ఐఐటీ నిపుణులతో సమగ్ర అధ్యయనం చేయించాలని బోర్డు నిర్ణయించింది.