తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మరోసారి ఈ-వేలం నిర్వహించేందుకు సిద్ధమైంది. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారితో పాటు ఇతర అనుబంధ ఆలయాల్లో భక్తులు కానుకగా సమర్పించిన కొత్త ఆర్ట్ సిల్క్ చీరలను ఆన్‌లైన్ ద్వారా వేలం వేయనున్నట్లు వెల్లడించింది. ఈ వేలం ప్రక్రియ నవంబర్ 23 నుంచి 25వ తేదీ వరకు కొనసాగనుంది.

ఈ మేరకు టీటీడీ అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ-వేలంలో భాగంగా మొత్తం 115 లాట్ల కొత్త ఆర్ట్ సిల్క్ చీరలను విక్రయానికి ఉంచినట్లు తెలిపారు. వీటికి ఈ-వేలం ఐడీ నంబర్లు 28814 నుంచి 28819 వరకు కేటాయించారు. భక్తులు స్వామివారికి భక్తిశ్రద్ధలతో సమర్పించిన ఈ వస్త్రాలను టీటీడీ క్రమ పద్ధతిలో ఆన్‌లైన్ వేలం ద్వారా విక్రయిస్తోంది.

ఈ వేలంలో పాల్గొనదలిచిన వారు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఈ-ప్రొక్యూర్‌మెంట్ పోర్టల్ konugolu.ap.gov.inలో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు మాత్రమే బిడ్డింగ్‌లో పాల్గొనేందుకు అర్హులని టీటీడీ స్పష్టం చేసింది. వేలానికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం తిరుపతిలోని టీటీడీ వేలం విభాగం కార్యాలయాన్ని సంప్రదించవచ్చు లేదా 0877-2264429, 9959988470 నంబర్లకు ఫోన్ చేయవచ్చు. పూర్తి సమాచారం టీటీడీ అధికారిక వెబ్‌సైట్ tirumala.orgలో కూడా అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు.