ప్రసిద్ధ శైవక్షేత్రం తిరువణ్ణామలైలో కార్తిక పౌర్ణమి గిరిప్రదక్షిణకు రంగం సిద్ధమైంది. మహాదీపోత్సవానికి ఒక రోజు ముందే, సోమవారం రాత్రి 11:42 గంటల నుంచి గిరివలమ్ ప్రారంభం కానుంది. ఈ ఆధ్యాత్మిక వేడుకలకు దేశవిదేశాల నుంచి ఏకంగా 50 లక్షల మందికి పైగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని జిల్లా యంత్రాంగం అంచనా వేస్తోంది. అరుణాచలేశ్వర ఆలయం వెనుక ఉన్న పవిత్ర అరుణాచల కొండపై మంగళవారం మహాదీపాన్ని వెలిగించనున్నారు.

ఆలయ నిర్వాహకులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం అర్ధరాత్రి 11:42 గంటలకు మొదలయ్యే గిరిప్రదక్షిణ మంగళవారం (నవంబర్ 24) రాత్రి 8:23 గంటల వరకు నిరంతరాయంగా కొనసాగుతుంది. దాదాపు 21 గంటల పాటు భక్తులు 14 కిలోమీటర్ల మేర సాగే పవిత్ర గిరివలమ్ చేసుకునే సదుపాయం లభించింది. సాధారణంగా కార్తిక మాసం పౌర్ణమి నాడు లేదా మహాదీపం వెలిగించిన మరుసటి రోజు గిరిప్రదక్షిణ మొదలవుతుంది. అయితే ఈ ఏడాది మహాదీపం వెలిగించే ముందు రోజు రాత్రే గిరివలమ్ సమయం ప్రారంభం కానుండటం గమనార్హం.

మంగళవారం ఉదయం, మధ్యాహ్నం వేళల్లో కూడా భక్తులు కొండ చుట్టూ ప్రదక్షిణ చేసే అవకాశం ఉంది. కార్తిక దీపోత్సవం, చిత్రా పౌర్ణమి సమయాల్లో తిరువణ్ణామలైకి భక్తులు పోటెత్తుతారు. సాధారణంగానే 40 లక్షల మంది వరకు తరలివస్తుంటారు. ఈసారి గిరివలమ్, మహాదీపం రెండూ కలిసి రావడంతో ఆ సంఖ్య 50 లక్షలు దాటుతుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు భారీ ఎత్తున ఏర్పాట్లు, వసతులు కల్పిస్తున్నారు.