సాధారణంగా ఒక నగర మేయర్ ప్రసంగం ఇస్తున్నారంటే అందరి దృష్టి ఆయన మాటల మీదే ఉంటుంది. కానీ న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మందానీ విషయంలో సీన్ రివర్స్ అయింది. ఆయన మాట్లాడుతుండగా వెనుక నిల్చున్న ఒక వ్యక్తి వింతగా కళ్లు తిప్పడంతో, నెటిజన్ల దృష్టి మొత్తం అతనిపై పడింది. దీంతో ఆ వ్యక్తి 'ఏలియన్' (గ్రహాంతరవాసి) లేదా 'రెప్టీలియన్' (బల్లి జాతి జీవి) అంటూ సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి.

ఈ నెల‌ 20న న్యూయార్క్ సిటీ హాల్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో మేయర్ మందానీ ప్రసంగించారు. 2032 నాటికి రికర్స్ ఐలాండ్ జైలును మూసివేయాలనే ప్రతిపాదనపై ఆయన మాట్లాడుతున్నారు. ఆయన వెనుక హార్లెం జిల్లా ప్రతినిధి, డెమొక్రాట్ నేత జోర్డాన్ రైట్ (32) నిల్చుని ఉన్నారు. "భద్రత, న్యాయం రెండూ కలిసి ఉండే నగరాన్ని నిర్మిద్దాం" అని మేయర్ చెబుతున్నప్పుడు రైట్ తన కళ్లను పైకి తిప్పడం, వింత హావభావాలు పలకడం కెమెరాలో రికార్డయింది.

ఈ వీడియో క్లిప్ 'ఎక్స్‌' (ట్విట్టర్)లో పోస్ట్ అవ్వడంతో క్షణాల్లో వైరల్ అయింది. మేయర్ మాటలను వదిలేసి అందరూ రైట్ ఎక్స్‌ప్రెషన్స్‌పైనే దృష్టి సారించారు. మనుషుల రూపంలో మన మధ్య తిరుగుతూ ప్రభుత్వాలను నియంత్రించే రెప్టీలియన్లు ఉన్నాయనే కుట్ర సిద్ధాంతాలను గుర్తుచేస్తూ, రైట్ కళ్ల కదలికలను వాటితో పోల్చారు. 

"బల్లులు ఏళ్లుగా మన మధ్యే జీవిస్తున్నాయి. రాజకీయాలను అవే నియంత్రిస్తున్నాయి" అని ఒక యూజర్ సరదాగా వ్యాఖ్యానించారు. ఈ ఘటనతో ఏలియన్లు, ఏరియా 51 వంటి కుట్ర సిద్ధాంతాలపై మరోసారి ఆన్‌లైన్‌లో చర్చ ఊపందుకుంది.