బంగారం కొనుగోళ్లను కొంతకాలం వాయిదా వేసుకోవాలంటూ గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన సలహా వ్యాపారులను, మదుపర్లను భారీ నష్టాల నుంచి కాపాడిందని బీజేపీ పేర్కొంది. నాడు ప్రధాని చేసిన సూచనను ‘డెత్ వారెంట్’గా అభివర్ణిస్తూ ప్రజల్లో భయాందోళనలు సృష్టించినందుకు గాను కాంగ్రెస్ పార్టీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది.

ఈ మేరకు వ్యాపార సంఘమైన ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ (సీటీఐ) ప్రధానమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతూ లేఖ రాసింది. మార్కెట్లో బంగారం ధరలు కిలోకు రూ. 1.90 కోట్ల నుంచి రూ. 1.25 కోట్లకు చేరి, దాదాపు రూ. 65 లక్షల మేర భారీగా తగ్గడంతో ప్రధాని సలహా ఎంతో మేలు చేసిందని సీటీఐ ఆ లేఖలో పేర్కొంది. ఈ ముందస్తు సూచన కారణంగా లక్షలాది మంది నగల వ్యాపారులు, ట్రేడర్లు, ఇన్వెస్టర్లు తీవ్ర నష్టాలను తప్పించుకోగలిగారని వివరించింది. అంతేకాకుండా, ప్రస్తుత పెళ్లిళ్ల సీజన్‌లో ఈ ధరల తగ్గుదల సాధారణ కుటుంబాలకు పెద్ద ఊరటనిచ్చిందని వ్యాపార వర్గాలు స్పష్టం చేశాయి.

సీటీఐ లేఖను ప్రస్తావిస్తూ బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ విలేకరులతో మాట్లాడారు. వ్యాపారులను, సాధారణ పౌరులను తప్పుదోవ పట్టించేలా ప్రవర్తించిన కాంగ్రెస్ నాయకత్వం తమ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆర్థిక నిర్వహణ, సాధారణ జీవనశైలితో పోలిస్తే గాంధీ-వాద్రా కుటుంబ జీవన విధానం భిన్నంగా ఉందని విమర్శించారు. ప్రభుత్వం తీసుకున్న సమయానుకూల నిర్ణయాలు, సూచనలు దేశ ఆర్థిక ప్రయోజనాలకు, సాధారణ పౌరులకు అండగా నిలిచాయని బీజేపీ స్పష్టం చేసింది.