భగవాన్ శ్రీ సత్యసాయి బాబా జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. సత్యసాయి బాబా సమాజానికి అందించిన ఆధ్యాత్మిక, ధార్మిక సేవలు ఎప్పటికీ చిరస్మరణీయమని కొనియాడారు. 

సత్యసాయి బాబా జీవితం, ఆయన అందించిన సందేశాన్ని గుర్తుచేసుకుంటూ సీఎం చంద్రబాబు, "భగవాన్ శ్రీ సత్యసాయి బాబా జయంతి సందర్భంగా వారు అందించిన ఆధ్యాత్మిక, ధార్మిక, సమాజ సేవను స్మరించుకుందాం. అందరినీ ప్రేమించు.. అందరినీ సేవించు అనే దివ్య సందేశంతో మానవాళికి ప్రేమ, సేవ, మానవతా విలువలను నేర్పిన మహనీయులు శ్రీ సత్యసాయి బాబా. నిస్వార్థ సేవే నిజమైన ఆధ్యాత్మికత అని చాటారు. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింసలపై సత్యసాయి బోధనలు ఎప్పటికీ ఆచరణీయం. విద్య, వైద్యం, తాగునీటి రంగాల్లో వారు అందించిన సేవలు చిరస్మరణీయం. సత్యసాయి చూపిన సేవామార్గాన్ని అనుసరిద్దాం" అని పేర్కొన్నారు.