భగవాన్ శ్రీ సత్యసాయి బాబా జయంతిని అధికారికంగా రాష్ట్ర పండుగగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. నవంబర్ 23న సత్యసాయి బాబా జయంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాయి భక్తులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ... "భారతీయ సమాజాన్ని ఆధ్యాత్మికంగా అత్యంత ప్రభావితం చేసి... జాతి సంస్కృతిని దేశ విదేశాలకు చాటి చెప్పిన మహానుభావుడు సత్యసాయి. అంతేకాదు విద్యాలయాలు, ఆసుపత్రులు, తాగునీటి పథకాలను నెలకొల్పి తన సామాజిక సేవాకార్యక్రమాల ద్వారా గొప్ప మానవతావాదిగా ప్రజల హృదయాలలో నిలిచిపోయారు సత్య సాయిబాబా. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారి సేవా మార్గాన్ని, బోధనలను భావితరాలకు అందించేందుకు సాయి జయంతిని రాష్ట్ర పండుగగా జరపాలని నిర్ణయించాం. మానవ సేవే పరమావధిగా జీవించిన సాయి బోధనలను ఈ సందర్భంగా స్మరించుకుందాం" అని పేర్కొన్నారు.