తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 20 నుంచి 29వ తేదీ వరకు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలను కల్పించనున్నారు. పరమ పవిత్రమైన వైకుంఠ ద్వార దర్శనాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ 10 రోజుల వ్యవధిలో మొత్తం 8.34 లక్షల మంది భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించేలా ప్రణాళికలు రూపొందించినట్లు టీటీడీ సాధికారిక మండలి ఛైర్మన్ ముద్దాడ రవిచంద్ర వెల్లడించారు. తిరుమల అన్నమయ్య భవనంలో బుధవారం సాయంత్రం నిర్వహించిన సాధికారిక మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ఈ సందర్భంగా ముద్దాడ రవిచంద్ర మాట్లాడుతూ, వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్య భక్తులకే అత్యధికంగా 92 శాతం ప్రాధాన్యత ఇస్తున్నామని స్పష్టం చేశారు. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాలకు సంబంధించిన ఎస్ఎస్‌డీ (SSD) టోకెన్లను ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు తెలిపారు. తొలి రెండు రోజులు ఎలాంటి సర్వదర్శనం ఉండదని, ఆ తర్వాతి 8 రోజుల పాటు భక్తులకు సర్వదర్శనం అమలు చేస్తామని వివరించారు.

రూ.2,750 కోట్లతో యాత్రికుల టౌన్‌షిప్
భక్తుల సౌకర్యార్థం అలిపిరి–ఎస్వీ జూ పార్క్ రోడ్డు సమీపంలోని టీటీడీ స్థలంలో శ్రీవాణి ట్రస్ట్ నిధులు రూ.2,750 కోట్లతో అత్యాధునిక యాత్రికుల టౌన్‌షిప్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ ప్రాజెక్టు డీపీఆర్, డిజైన్ల తయారీ, పర్యవేక్షణ కోసం ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థను ఎంపిక చేయాలని బోర్డు నిర్ణయించింది. 

అలాగే శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం నుంచి శ్రీవారిమెట్టు వరకు రహదారి అభివృద్ధి, ఇంటర్‌లాకింగ్ సిమెంట్ బ్లాక్‌ల నిర్మాణం కోసం రూ.9.50 కోట్లు మంజూరు చేశారు. అలిపిరి నడకమార్గంలో లక్ష్మీనరసింహస్వామి ఆలయం నుంచి మోకాళ్లమిట్ట వరకు రోడ్డుపై నడిచివచ్చే భక్తుల కోసం ఐఐటీ నిపుణుల సహకారంతో కేబుల్ బ్రిడ్జి నిర్మాణ సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు.

ఉద్యోగులకు బ్రహ్మోత్సవ బహుమానం.. ఇళ్ల స్థలాలు
శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఉద్యోగులకు అందించే ప్రోత్సాహక బహుమానాన్ని ఖరారు చేశారు. శాశ్వత ఉద్యోగులకు రూ.16,940, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి రూ.8,289 చొప్పున చెల్లించనున్నారు.

2007 సీనియారిటీ జాబితా ప్రకారం ఫేజ్-3 పరిధిలోని రిటైర్డ్ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి వారసులకు పల్లం గ్రామంలో ఇంటి ప్లాట్లు కేటాయించేందుకు ఆమోదం తెలిపారు. మిగిలిన అర్హుల పరిశీలనకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నారు. పాదిరేడు లేఅవుట్ అభివృద్ధికి సంబంధించి గతంలో కేటాయించిన రూ.230 కోట్ల ధ్రువీకరణకు మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 

విధి నిర్వహణలో మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు పరిహారంతో పాటు, భవిష్యత్తులో అర్హులైన ఉద్యోగుల కుటుంబాలకు కనీసం రూ.10 లక్షల ఆర్థిక ప్రయోజనం దక్కేలా నూతన సంక్షేమ విధానాన్ని తీసుకురానున్నారు.

వైద్యం, పర్యావరణం, గోసంరక్షణకు పెద్దపీట
పేద రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు, పాత బకాయిల చెల్లింపులకు గాను స్విమ్స్ ఆసుపత్రికి అదనంగా రూ.41.23 కోట్ల ప్రత్యేక గ్రాంటును కేటాయించారు. ఎస్వీ ఆయుర్వేద కళాశాలలో బీఏఎంఎస్ సీట్లను 40 నుంచి 60కి పెంచారు. ఎస్వీ సంప్రదాయ శిల్పకళాశాల విద్యార్థుల కోసం రూ.23 కోట్లతో 229 మంది సామర్థ్యం గల హాస్టల్ భవనాన్ని నిర్మించనున్నారు.

తిరుమలను కాలుష్య రహిత క్షేత్రంగా (నెట్ జీరో అండ్ కార్బన్ న్యూట్రల్) తీర్చిదిద్దేందుకు పర్యావరణ పరిరక్షణ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దీని బాధ్యతలను రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ టి.వి. సత్యనారాయణకు అప్పగించారు. శ్రీవారి నిత్య కైంకర్యాలకు అవసరమైన పాలు, నెయ్యిని సొంతంగా సమకూర్చుకునేందుకు వీలుగా 500 దేశీయ జాతి గోవుల కొనుగోలు, రవాణా కోసం రూ.7.50 కోట్లు విడుదల చేశారు. 

తిరుమల అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల సంరక్షణ, భక్తుల భద్రత కోసం ఏపీ అటవీ శాఖకు రెండేళ్ల కాలానికి రూ.16.40 కోట్ల ఆర్థిక సహాయం అందించేందుకు నిర్ణయించారు. అదనంగా 348 మంది పారిశుధ్య సిబ్బంది నియామకానికి, సుమారు రూ.90 కోట్లతో అగరుబత్తి యూనిట్ టెండర్లకు మండలి ఆమోదం తెలిపింది.

ఈ సమావేశంలో దేవాదాయ శాఖ కార్యదర్శి కె. కన్నబాబు, ఆర్థిక శాఖ కార్యదర్శి వి. వినయ్‌చంద్, టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి, జేఈవోలు డాక్టర్ ఏ. శరత్, ప్రభల గోపినాథ్, సీవీఎస్‌వో మురళీకృష్ణ, చీఫ్ ఇంజనీర్ మనోహరం తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.