న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో ఇంకా 15 ఓవర్ల ఆట మిగిలి ఉండగానే మ్యాచ్‌ను డ్రాగా ముగించడంపై భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ స్పష్టతనిచ్చాడు. తమ ఫాస్ట్ బౌలర్లు తీవ్ర అలసటకు గురవడం, రెండో టెస్టుకు మధ్య కేవలం మూడు రోజుల సమయం మాత్రమే ఉండటంతోనే డ్రాకు అంగీకరించి షేక్‌హ్యాండ్ ఇచ్చినట్లు వెల్లడించారు. బేసిన్ రిజర్వ్ మైదానంలో భారత్‌కు మరో 5 వికెట్లు అవసరమైన దశలో డారిల్ మిచెల్ (49 నాటౌట్), గ్లెన్ ఫిలిప్స్ (26 నాటౌట్) అజేయ పోరాటంతో కివీస్‌ను ఆదుకున్నారు. దాంతో న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 120 ఓవర్లలో 239/5 స్కోరు వద్ద మ్యాచ్ ముగిసింది.

మ్యాచ్ అనంతరం జరిగిన ప్రజెంటేషన్‌లో గిల్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘పిచ్ నుంచి ఏమైనా సహకారం లభించి ఉంటే గెలుపు కోసం చివరి వరకు ప్రయత్నించేవాళ్లం. కానీ మా ఫాస్ట్ బౌలర్లు బాగా అలసిపోయారు. మ్యాచ్‌లో దాదాపు అందరూ తలో 50 ఓవర్లు వేశారు. రేపు ప్రయాణం చేయాల్సి ఉంది. ఆ తర్వాత కేవలం మూడు రోజుల్లోనే తర్వాతి టెస్ట్ మ్యాచ్ మొదలవుతుంది. కాబట్టి మా బౌలర్లను ఉత్సాహంగా చాలా ముఖ్యం. మరో ఐదు పది ఓవర్లు వేసినా పెద్దగా ఫలితం ఉంటుందని నేను అనుకోలేదు’’ అని గిల్ వివరించాడు.

చివరి రోజు ఆట డ్రాగా మారడాన్ని తాము నిరాశగా భావించడం లేదని గిల్ స్పష్టం చేశాడు. ఆ పిచ్‌పై చివరి రోజు పది వికెట్లు పడగొట్టడం పెద్ద సవాలని తమకు ముందే తెలుసన్నాడు. కొన్ని అవకాశాలు వచ్చినా అదృష్టం కలిసిరాలేదని పేర్కొన్నాడు. విదేశీ గడ్డపై జట్టు ప్రదర్శన అద్భుతంగా సాగిందన్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 720/9 భారీ స్కోరు చేయడంలో బ్యాటర్లందరూ సమష్టిగా రాణించారని ప్రశంసించాడు. శుక్రవారం నుంచి క్రైస్ట్‌చర్చ్‌లోని హ్యాగ్లీ ఓవల్‌లో ప్రారంభం కానున్న రెండో టెస్టు కోసం వ్యూహాల్లో పెద్దగా మార్పులు చేయబోమన్నాడు. అక్కడి పిచ్ బౌలర్లకు మరింత అనుకూలిస్తుందని ఆశిస్తున్నట్లు గిల్ తెలిపాడు.