క్రికెట్ ప్రపంచాన్ని కుదిపేసిన 2018 నాటి ఆస్ట్రేలియా బాల్ ట్యాంపరింగ్ వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ ఘటనపై దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజం ఏబీ డివిలియర్స్ సంచలన ఆరోపణలు చేశాడు. బాల్ ట్యాంపరింగ్ విషయం ఆస్ట్రేలియా జట్టులోని ప్రతి ఒక్క ఆటగాడికీ తెలుసని, ఇందులో తనకు సున్నా శాతం కూడా అనుమానం లేదని స్పష్టం చేశాడు. కేప్‌టౌన్ టెస్టుకు ముందే ఆసీస్ జట్టు హద్దులు దాటిందని, ఉద్దేశపూర్వకంగానే నిబంధనలు ఉల్లంఘించిందని ఏబీడీ అన్నాడు.

ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఉస్మాన్ ఖవాజా, కామెరాన్ బాన్‌క్రాఫ్ట్ ఇటీవల ఈ వివాదంపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఏబీ డివిలియర్స్ తన యూట్యూబ్ ఛానెల్‌లో స్పందించాడు. డివిలియర్స్ మాట్లాడుతూ.. "ఈ వివాదంలో చిక్కుకున్న ఆటగాళ్లపై నాకు వ్యక్తిగతంగా సానుభూతి ఉంది. కానీ వారు చేసిన పనిని మాత్రం సమర్థించను. ఆ రోజు ఏం జరిగిందో, దానికి ముందు ఎన్ని మ్యాచ్‌లలో ఇలా చేశారో ఎవరికి తెలుసు?" అని వ్యాఖ్యానించాడు.

బాల్ ట్యాంపరింగ్ కేవలం కేప్‌టౌన్, పోర్ట్ ఎలిజబెత్ టెస్టులకే పరిమితం కాలేదని, సిరీస్‌లోని తొలి టెస్టు జరిగిన డర్బన్‌లోనూ ఇలాగే జరిగిందని డివిలియర్స్ ఆరోపించాడు. "అందరూ పోర్ట్ ఎలిజబెత్‌లో కూడా ట్యాంపరింగ్ జరిగిందని అంగీకరిస్తున్నారు. కానీ డర్బన్‌లోనూ అదే పరిస్థితి. నా మనసులో ఎలాంటి సందేహం లేదు. ఆ ఫుటేజీని పరిశీలిస్తే మీకే అర్థమవుతుంది" అని ఏబీడీ పేర్కొన్నాడు.

అసలు సమస్య శాండ్‌పేపర్ వాడకం కాదని, మైదానంలో అక్రమాలకు పాల్పడాలని జట్టు సభ్యులు ముందే ఒక ప్రణాళికతో నిర్ణయం తీసుకోవడమేనని డివిలియర్స్ అభిప్రాయపడ్డాడు. "అందరూ శాండ్‌పేపర్ గురించి మాట్లాడుతున్నారు. కానీ అసలు విషయం అది కాదు. ఏదో ఒక అక్రమం చేయాలని జట్టు ముందే నిర్ణయించుకుంది. అదే కీలకమైన పాయింట్" అని వివరించాడు.

2018లో జరిగిన ఈ 'శాండ్‌పేపర్‌గేట్' వివాదం, ఉస్మాన్ ఖవాజా తన ఆత్మకథ 'సబ్ర్'లో కొన్ని విషయాలు వెల్లడించడంతో మళ్లీ చర్చనీయాంశమైంది. ఆ తర్వాత ఈ కుంభకోణంలో నిషేధానికి గురైన కామెరాన్ బాన్‌క్రాఫ్ట్ కూడా ఒక కథనం ద్వారా అప్పటి బౌలింగ్ కోచ్, హెడ్ కోచ్ సమక్షంలోనే ట్యాంపరింగ్ ప్రణాళిక జరిగిందని ఆరోపించడంతో ఈ వివాదం మరింత ముదిరింది. అయితే, ఖవాజా ఆరోపణలను ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ కొట్టిపారేయడం గమనార్హం.