పేదరికం అంటే కేవలం ఆదాయం లేదా వేతనాల కొరత మాత్రమే కాదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అభిప్రాయపడ్డారు. ఒకే ఒక్క అనారోగ్య సమస్య కుటుంబ పొదుపు మొత్తాన్ని తుడిచిపెట్టేసి మళ్లీ దారిద్య్రంలోకి నెట్టేస్తుందని తెలిపారు.. కేవలం చేతికి డబ్బులు ఇవ్వడం ద్వారా పేదరికాన్ని కొలవలేమని, అలాగే పరిష్కరించలేమని పేర్కొన్నారు. సరైన ఇల్లు, రక్షిత తాగునీరు, పారిశుద్ధ్యం, సరైన వైద్యం లేని కుటుంబానికి ఆదాయం పెరిగినప్పటికీ ఎప్పుడూ ముప్పు పొంచే ఉంటుందని హెచ్చరించారు. ఈ మేరకు ప్రొఫెషనల్ నెట్‌వర్కింగ్ వేదిక లింక్డిన్‌లో ఆమె ఒక ప్రత్యేక వ్యాసం రాశారు.

భారత్‌లో పేదరికం తగ్గుముఖం పట్టడంపై ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన తాజా ‘పావర్టీ అండ్ ఈక్విటీ బ్రీఫ్’ నివేదికను ఆర్థిక మంత్రి ప్రస్తావించారు. ఈ నివేదిక ప్రకారం.. 2011 నుంచి 2023 మధ్య కాలంలో దేశంలో దాదాపు 50 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు. అత్యంత తీవ్రమైన పేదరికం దాదాపు తుడిచిపెట్టుకుపోయిందని గుర్తుచేశారు. ఈ విజయం నగదు పంపిణీ వల్ల సాధ్యం కాలేదని, ప్రతి ఇంటి అవసరాలను గుర్తించి చేపట్టిన విధానాల వల్లే లభించిందని తెలిపారు.

స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఆరు దశాబ్దాల పాటు పేదరిక నిర్మూలన నెరవేరని హామీగానే మిగిలిపోయిందని సీతారామన్‌ తెలిపారు. 2010ల ప్రారంభంలోనూ భారత్‌ను పారిశుధ్యం, పౌష్టికాహారం, గ్యాస్ సిలిండర్లు, బ్యాంకింగ్ సౌకర్యాలు లేని పేద దేశంగానే ప్రపంచం చూసిందని పేర్కొన్నారు. అప్పట్లో కేవలం డబ్బులు పంచిపెడితేనే పేదరికం పోతుందనే పాత పద్ధతులను అనుసరించారని విమర్శించారు.

పదేళ్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం 'అంత్యోదయ' విధానాన్ని ఎంచుకుందని నిర్మల వివరించారు. వరుసలో నిల్చున్న చివరి వ్యక్తికి సంక్షేమం అందాలనే లక్ష్యంతో పనిచేశామని చెప్పారు. పేదరిక నిర్మూలనకు మాయాదండాలు ఏవీ ఉండవని, లబ్ధిదారులకు పథకాలు చేరేలా సాంకేతికతను జోడించి పీఎం మోదీ స్వయంగా ప్రతి అంశాన్ని పర్యవేక్షించారని తెలిపారు. 

కరోనా సమయంలో తండ్రిని కోల్పోయి మూతపడ్డ ప్రింటింగ్ ప్రెస్‌ను ముద్రా లోన్ సాయంతో తిరిగి తెరిచి, నేడు ఎనిమిది మందికి ఉపాధి కల్పిస్తున్న పశ్చిమ బెంగాల్‌కు చెందిన సుస్మిత ఘరాయ్ విజయాన్ని ఆమె ప్రస్తావించారు. అలాగే నాగాలాండ్‌లోని మారుమూల ప్రాంతంలో చిరుధాన్యాల ఉత్పత్తులను ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్న ‘లఖ్‌పతీ దీదీ’ ఎస్తేర్ ఆత్మవిశ్వాసాన్ని గుర్తుచేసుకుంటూ, వారు ‘కోటీశ్వరులైన దీదీలు’గా ఎదగాలని ఆకాంక్షించారు. 2047 నాటికి ‘వికసిత్ భారత్’ లక్ష్యాన్ని చేరుకోవాలంటే పేదరికం నుంచి బయటపడిన వారు మళ్లీ వెనక్కి జారకుండా ఆర్థిక రక్షణ, మార్కెట్, డిజిటల్ వ్యవస్థలను అనుసంధానించాలని స్పష్టం చేశారు.